విమానాశ్రయం రన్‌వేపై పరీక్షా కేంద్రం.. హోంగార్డు ఉద్యోగానికి 8 వేల మంది పోటీ
జనరల్‌గా పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలను సైతం వాటినే కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తారు.
జనరల్‌గా పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలను సైతం వాటినే కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తారు. కానీ, ఎయిర్‌పోర్ట్ రన్ వేను పరీక్షా కేంద్రంగా మార్చి ఎగ్జామ్ పెడతారని ఎవరైనా ఊహిస్తారా..? వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. జరిగింది అదే..! పరీక్షలను స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించడం మనం చూసి ఉంటాం.. కానీ, ఇందుకు భిన్నంగా ఎయిర్‌పోర్ట్ రన్‌వేను పరీక్షా కేంద్రంగా మార్చి ఎగ్జామ్ నిర్వహించిన ఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఒడిశాలోని సంబల్‌పూర్‌లో డిసెంబర్ 16న హోంగార్డు పోస్టుల భర్తీకి పోటీ పరీక్ష నిర్వహించారు. అయితే.. కేవలం 187 హోంగార్డు పోస్టుల కోసం ఏకంగా 8వేల మంది యువత పోటీపడ్డారు. 187 హోమ్ గార్డ్ పోస్టులకు కనీస అర్హత ఐదవ తరగతి ఉత్తీర్ణత. అయినప్పటికీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సహా వేలాది మంది అభ్యర్థులు తరలివచ్చారు. దీంతో సాధారణ పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు జమాదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్ రన్‌వేనే పరీక్ష కేంద్రంగా మార్చారు.
హోంగార్డ్ పరీక్ష రాసేందుకు తెల్లవారుజామునే జమాదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్ రన్‌వే దగ్గరకు అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని ఎయిర్‌స్ట్రిప్‌లో ఓపెన్ స్కై కింద కూర్చోబెట్టారు. నేలపైనే కూర్చుని తమ భవిష్యత్తును వెతుక్కుంటూ పరీక్ష రాశారు అభ్యర్థులు. అయితే ఈ నియామకాలు కేవలం ఒప్పంద ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయినప్పటికీ, కనీస ఉపాధి కరువైన తరుణంలో యువత వీటిపైనే ఆశలు పెట్టుకుంది. దాదాపు 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 8 వేల మంది అభ్యర్థులు ఈ పోటీ పరీక్షకు హాజరయ్యారు. 8వేల మంది అభ్యర్థులకు ఒకేచోట పరీక్ష నిర్వహించాలంటే 20 స్కూళ్లల్లో ఏర్పాట్లు చేయాలని సంబల్‌పూర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. అందుకే ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై పరీక్ష నిర్వహించినట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు.