గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు హతం.. కానిస్టేబుల్ వీరమరణం!
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భ్రమగఢ్ తాలూకాలో నిన్న రాత్రి నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇందులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీస్ కానిస్టేబుల్ దీపక్ మాధవి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
సి-60 కమాండో జోగా దీపక్ గాయపడగా, చికిత్స కోసం అతడిని హెలికాప్టర్‌లో గడ్చిరోలిలోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌తో సహా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.