Parenting Tips : పిల్లల మొబైల్ వ్యసనానికి చెక్.. కర్ణాటక ప్రభుత్వం డిజిటల్ డిటాక్స్ పాలసీ సిద్ధం

Parenting Tips : కర్ణాటక ప్రభుత్వం డిజిటల్ డిటాక్స్ పాలసీని తెచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం, రోజుకు ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్ ఉండేలా కొత్త రూల్స్ అమలు చేయనున్నారు.

Update: 2026-03-24 04:42 GMT

Parenting Tips

Parenting Tips : నేటి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఆఖరికి నడిచేటప్పుడు కూడా కళ్లు మొబైల్ స్క్రీన్‌పైనే ఉంటున్నాయి. ఈ అలవాటు ఇప్పుడు పిల్లల పాలిట శాపంగా మారుతోంది. మొబైల్ మాయలో పడి పిల్లలు తమ బాల్యాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని గమనించిన కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలను ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయడానికి డిజిటల్ డిటాక్స్ పాలసీ అనే సరికొత్త విధివిధానాలను సిద్ధం చేసింది.

ఏమిటీ డిజిటల్ డిటాక్స్ పాలసీ?

కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ఈ డిజిటల్ డిటాక్స్ పాలసీ ముఖ్య ఉద్దేశం పిల్లలు టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించడం. పిల్లలు మొబైల్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేవలం పరిమిత సమయం మాత్రమే వాడేలా ఈ పాలసీ సూచిస్తోంది. వినోదం కోసం రోజుకు కేవలం ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్ ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు మార్గదర్శకాలు జారీ చేయనుంది. మితిమీరిన స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్కూళ్లలో సరికొత్త మార్పులు

ఈ పాలసీని కేవలం ఇళ్లకే పరిమితం చేయకుండా స్కూళ్లలో కూడా అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఒక డిజిటల్ వెల్నెస్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ విద్యార్థులలో మొబైల్ వ్యసన లక్షణాలను గుర్తించి, వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తుంది. పాఠ్యాంశాల్లో డిజిటల్ సాక్షరత, ఆన్‌లైన్ భద్రతను ఒక భాగంగా చేరుస్తారు. సైబర్ బుల్లింగ్, ఆన్‌లైన్ మోసాల నుంచి పిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఇక్కడ నేర్పిస్తారు. ఉపాధ్యాయులకు కూడా పిల్లల డిజిటల్ అలవాట్లను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బంద్

ఈ పాలసీలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ (Facebook, Instagram, X మొదలైనవి) వాడకుండా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల పిల్లలు అనవసరమైన కంటెంట్ బారిన పడకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. స్కూళ్లలో కూడా కొంత సమయాన్ని నో టెక్నాలజీ జోన్ గా ప్రకటించి, ఆ సమయంలో పిల్లలు కేవలం ఆటలు, పుస్తక పఠనం వంటి ఆఫ్‌లైన్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా పిల్లల మానసిక వికాసానికి ఇది ఎంతో తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత ఏంటి?

పిల్లల మొబైల్ వ్యసనాన్ని తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఇంట్లో స్క్రీన్ టైమ్ కంట్రోల్ చేయడం, పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వారిని బయట ఆడుకునేలా ప్రోత్సహించడం వంటి అంశాలపై పేరెంట్స్‌కు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. డిజిటల్ డిటాక్స్ అంటే టెక్నాలజీని పూర్తిగా దూరం చేయడం కాదు, దానిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడటం నేర్పించడమేనని ఈ పాలసీ సారాంశం. కర్ణాటక తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News