Fuel Supply : అమెరికా గ్యాస్.. రష్యా ఆయిల్.. భారత్ రూటే సెపరేటు.. ఇక గ్యాస్ కష్టాలకు చెక్

Fuel Supply : పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వేళ అమెరికా, రష్యా నుంచి భారత్‌కు భారీగా ఎల్పీజీ, ముడి చమురు సరఫరా అగింది. మంగళూరు పోర్టులో ఇంధన నిల్వలు పెరగడంతో గ్యాస్ కొరతకు చెక్ పడనుంది.

Update: 2026-03-23 01:52 GMT

Ship Pyxis Pioneer

Fuel Supply : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, ఎల్పీజీ సరఫరాకు బ్రేకులు పడుతున్న వేళ భారతదేశానికి ఊపిరి పీల్చుకునే వార్త అందింది. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్ తన ఇంధన అవసరాల కోసం చాకచక్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా అమెరికా, రష్యా దేశాల నుంచి భారీ ఎత్తున గ్యాస్, ముడి చమురు నిల్వలు మన దేశానికి చేరుకున్నాయి. మంగళూరు పోర్టు కేంద్రంగా జరుగుతున్న ఈ పరిణామాలు దేశ ఇంధన భద్రతలో కీలక మార్పులను సూచిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న అశాంతి వల్ల సాధారణంగా వచ్చే ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ తన వ్యూహాన్ని మార్చి అమెరికా వైపు మొగ్గు చూపింది. ఫిబ్రవరి 14న టెక్సాస్‌లోని నెదర్లాండ్స్ పోర్టు నుంచి బయలుదేరిన పైక్సిస్ పయనీర్ అనే భారీ నౌక ఆదివారం మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఇందులో సుమారు 16,714 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) ఉంది. ఏజిస్ లాజిస్టిక్స్ ఆధ్వర్యంలో ఈ గ్యాస్‌ను అన్‌లోడ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా చూడటంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

రష్యా చమురు నౌక దారి మళ్లింపు

అమెరికా గ్యాస్ నౌక రాకకు ఒక రోజు ముందే, రష్యా నుంచి ఆక్వా టైటాన్ అనే భారీ చమురు ట్యాంకర్ మంగళూరు తీరానికి చేరుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నౌక సుమారు 7.7 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వాస్తవానికి చైనాకు వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో దారి మళ్లించి భారత్‌కు చేరుకోవడం విశేషం. ఈ ముడి చమురును సముద్రగర్భ పైప్‌లైన్ల ద్వారా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL)కు తరలిస్తున్నారు. ఇది మన దేశ దౌత్య, ఇంధన వ్యూహానికి దక్కిన విజయంగా భావిస్తున్నారు.

మంగళూరు పోర్టు.. దేశానికే ఇంధన కోట

దేశంలోని కీలక పోర్టులలో ఒకటైన న్యూ మంగళూరు పోర్ట్ ఇప్పుడు ఇంధన నిల్వలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ సదుపాయం ఉంది. ఇది సముద్ర మట్టానికి 225 మీటర్ల లోతులో ఉండి, దాదాపు 80,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇటువంటి పటిష్టమైన సదుపాయాలు ఉండటం వల్లే అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో కూడా భారత్ తన ఇంధన అవసరాలను సులభంగా తీర్చుకోగలుగుతోంది. ఇటీవల శివాలిక్, నందా దేవి వంటి నౌకలు కూడా ఇక్కడికే భారీగా ఇంధనాన్ని తీసుకువచ్చాయి.

ప్రత్యామ్నాయ వనరులే దిక్కు

మిడిల్ ఈస్ట్ దేశాలపైనే పూర్తి ఆధారపడకుండా, రష్యా, అమెరికా వంటి దేశాల నుంచి తక్కువ ధరకు ఇంధనాన్ని సేకరించడంపై భారత్ ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్లోబల్ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా, దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ఉండటానికి ఈ ప్రత్యామ్నాయ సరఫరాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అమెరికా టెక్సాస్ నుంచి వచ్చిన ఈ భారీ గ్యాస్ నిల్వలు, రష్యా చమురు రాకతో రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News