PM Narendra Modi Record: అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ
PM Narendra Modi Record: ప్రధాని మోదీ 8,931 రోజుల పాటు ముఖ్యమంత్రి, ప్రధానిగా పనిచేసి.. పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు.
PM Narendra Modi Record
PM Narendra Modi రికార్డు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పటివరకూ ప్రధానమంత్రిగా 8,931 రోజుల పాటు ప్రభుత్వ అధిపతిగా ఉంటూ వస్తున్నమోదీ, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల రికార్డును అధిగమించారు. ప్రధాని మోదీ గతంలో గుజరాత్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, అలాగే ముఖ్యమంత్రిగా అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధానమంత్రి కూడా ఆయనే.
నాలుగు సార్లు ముఖ్యమంత్రి.. మూడుసార్లు ప్రధానిగా..
మోదీ నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర మోదీ, ఆరేళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీ తరఫున మహా గుజరాత్ ఉద్యమంలో భాగమయ్యారు. ఆ తర్వాత ఎనిమిదేళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 2001 అక్టోబర్ 7న, 51 ఏళ్ల వయసులో, శాసనసభ్యుడు కూడా కాకుండానే, మోదీ గుజరాత్ 14వ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తన 24 ఏళ్ల పదవీకాలంలో 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మూడవసారి దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2025లో, మోదీ ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. అయితే, నెహ్రూ కంటే వెనుక ఉన్నారు.
అత్యధిక కాలం ఉన్న రెండో ప్రధాని
నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వారిలో రెండవవారు. ఆయన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నెలకొల్పిన 4,077 రోజుల (జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు) రికార్డును అధిగమించారు. మార్చి 22, 2026 నాటికి, నరేంద్ర మోదీ 4,318 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసి ఉంటారు.
అత్యధిక కాలం ప్రధానిగా నెహ్రూ
అయితే, ప్రధానమంత్రిగా అత్యధిక కాలం వరుసగా పనిచేసిన రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది. ఆయన ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు, మొత్తం 6,126 రోజులు పనిచేశారు. ప్రధాని మోదీ, నెహ్రూ రికార్డు కంటే 1,812 రోజులు వెనుకబడి ఉన్నారు. ఆ రికార్డును బద్దలు కొట్టాలంటే, ఆయన 2029 తర్వాత కూడా ప్రధానమంత్రిగా కొనసాగాల్సి ఉంటుంది.
అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చామ్లింగ్..
భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది. ఆయన పదవీకాలం డిసెంబర్ 12, 1994 నుండి మే 26, 2019 వరకు కొనసాగింది. అంటే ఆయన సుమారు 24 సంవత్సరాల 165 రోజుల పాటు పనిచేశారు. 23 ఏళ్ల పాటు పనిచేసిన ముఖ్యమంత్రి జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. ఆయన వరుసగా ఐదు ఎన్నికలలో గెలిచి, విరామం లేకుండా ఇంతకాలం అధికారంలో కొనసాగారు.