Bus Accident: ప్రభుత్వ బస్సు బీభత్సం.. ఐదుగురి మరణం

Bus Accident: తమిళనాడు సేలంలో ప్రభుత్వ బస్సు అదుపుతప్పి దూసుకుపోవడంతో ఐదుగురు మరణించిన సంఘటన చోటుచేసుకుంది.

Update: 2026-03-20 13:19 GMT

Bus Accident

Bus Accident: సేలంలోని అరియనూర్ సమీపంలో ప్రభుత్వ బస్సు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని, సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టింది . ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం, విషాదం నెలకొన్నాయి.

సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై అరియనూర్ సమీపంలో ఒక ప్రభుత్వ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు మధ్యలో ఉన్న బ్యారియర్‌ను దాటి బస్సు వేగంగా దూసుకుపోయింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఆ బస్సు, ఎదురుగా వస్తున్న ఒక సరుకు రవాణా వాహనాన్ని, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అన్ని వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఐదుగురు మృతి..

ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన 10 మందికి పైగా వ్యక్తులను సేలం ప్రభుత్వ మోహన్ కుమారమంగళం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య 5కు పెరిగింది. మృతులలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

సహాయక చర్యలు..

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కొండలంబట్టి, మగుడంజవాడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై గంటకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సేలం ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Tags:    

Similar News