Tirunelveli: అటవీ ప్రాంతంలో కాలిపోయిన కారు.. బూడిదైన కుటుంబం
Tirunelveli: తిరునెల్వేలి అడవుల్లో ఘోరం చోటుచేసుకుంది. కారులో సజీవ దహనమైన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు. అప్పుల బాధే కారణమా? పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Tirunelveli
Tirunelveli: అటవీ ప్రాంతంలో కాలిపోయిన ఒక కారును చూశారు కొందరు వ్యక్తులు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూసేసరికి పూర్తిగా కాలిపోయిన కారు.. ఆ కారులో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు బూడిద కుప్పలుగా కనిపించారు. వారంతా ఒకే కుటుంబంగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మంగళవారం (మార్చి 17) తిరునెల్వేలి జిల్లాలోని వెటియాన్విలై సమీపంలో పెట్టికుళం అటవీ ప్రాంతంలో ఒక కారు అగ్నిప్రమాదంలో కాలిపోయింది. అటుగా వెళ్తున్న వారు ఇచ్చిన సమాచారం మేరకు వల్లియూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందు సీటులో ఒక పురుషుడి కాలిపోయిన అస్థిపంజరం, వెనుక సీటులో ఇద్దరు పిల్లలతో ఉన్న ఒక మహిళ పూర్తిగా కాలిపోయి కనిపించారు. దీంతో పోలీసులు స్నిపర్ డాగ్స్ ను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆధారాలు సేకరించారు. తిరునెల్వేలి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రసన్న కుమార్, వల్లియూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకటేశన్‌తో సహా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు జరిపారు. వల్లియూర్ పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసి తరువాతి ప్రక్రియలు చేపట్టారు.
ఒకే కుటుంబం..
పోలీసులు కారు కాలిపోయిన ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పరిశిలించారు. ఇక ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్, ఇంజన్ నంబర్ ద్వారా జరిపిన విచారణలో ఒక ఆధారం లభించింది. దర్యాప్తు మొదటి దశలో, మృతులు చెన్నైలోని నందంబక్కం, పెరియార్ నగర్‌కు చెందిన మహమ్మద్ రబీ, అతని భార్య సెయితు నస్రీన్ ఫాతిమా, వారి ఇద్దరు కుమార్తెలు అని వెల్లడైంది. వారందరూ 13వ తేదీన తిరునెల్వేలికి వచ్చినట్లు తెలిసింది.
అప్పుల కారణంగా..
తిరునెల్వేలిలో ముస్లింలకు పవిత్ర స్థలంగా భావించే అత్తన్‌కరై మసీదు దర్గాలో, రంజాన్ మాసంలోని 27వ రాత్రి అయిన లైలతుల్ ఖద్ర్ ప్రత్యేక ఆరాధనలో వారు పాల్గొన్నారు. అనంతరం, మసీదులోని పేదలకు బట్టలు దానం చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత, పెట్టికుళం అటవీ ప్రాంతంలో కారును నిలిపివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పుల సమస్యల కారణంగా కొన్ని నెలల క్రితం నందంబక్కంలోని తమ సొంత ఇంటిని మహమ్మద్ రబీ అమ్ముకున్నట్లు సమాచారం.
పలు కోణాల్లో దర్యాప్తు..
అంతేకాకుండా, వారు అప్పుల్లో ఉండటంతో ఆ కష్టాన్ని భరించలేక కారులో నెల్లైకి వెళ్లినట్లు భావిస్తున్నారు. వారంతా దైవ ప్రార్ధనల అనంతరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఉండవచ్చని అనుకుంటున్నారు. పోలీసుల అంచనా ప్రకారం నిర్జనంగా ఉన్న అటవీ ప్రాంతంలో అందరూ కలిసి ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చు. అయితే, ఇదే కాకుండా ఈ మరణాల వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా? ఎవరైనా వారిని కొట్టి కారులోనే నిప్పంటించారా, లేదా ఏసీలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో మరణించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకా కొంత క్లారిటీ రావచ్చని పోలీసులు చెబుతున్నారు.