Kerala Elections 2026: కేరళలో ముగిసిన నామినేషన్ల గడువు
Kerala Elections 2026: కేరళలో ఏప్రిల్ 9న జరగనున్న శాసనసభ ఎన్నికలకు గాను నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 26 వరకూ సమయం ఉంది.
Kerala Elections 2026
Kerala Elections 2026: కేరళ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి గడువు ముగిసింది. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో మొత్తం 1269 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన రేపు (మార్చి 24) జరగనుంది. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ మార్చి 26. దీని తరువాత ఎన్నికల తుది స్వరూపం వెల్లడి కానుంది.
ఎన్నికల ప్రకటన తర్వాత నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం ఆరు పనిదినాల సమయం మాత్రమే ఇచ్చారు. అందువల్ల, ఈసారి నామినేషన్ల దాఖలు సమయంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. టికెట్ దక్కించుకున్నది పాపం వెంటనే వెళ్లి నామినేషన్ వేశేశారు. గతంలో లా పెద్ద ర్యాలీలు లాంటివి ఎక్కడా లేకుండానే నామినేషన్ల పర్వం సైలెంట్ గా ముగిసింది.
ఇదిలా ఉంటే, పోలింగ్ విధుల్లో ఉన్న అధికారులు, పోలీసుల కోసం పోస్టల్ బ్యాలెట్ల ఏర్పాట్లను ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ప్రిసైడింగ్ అధికారులు, తొలి పోలింగ్ అధికారులకు ఇచ్చే శిక్షణ మొదటి దశ రేపటి నుంచి మార్చి 29 వరకు జరుగుతుంది. పోలింగ్ అధికారుల శిక్షణా కేంద్రాల్లో ఓటరు సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోలీసు సిబ్బందికి 7 రోజుల వరకు గడువు ఇస్తామని ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. ఖేల్కర్ తెలిపారు.
ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ, రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. సంస్కృతిపై డాక్టర్ థామస్ ఐజాక్ చేసిన వ్యాఖ్యలకు రమేష్ పిషారోడి ఇచ్చిన ప్రతిస్పందన ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కేరళలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో పాటు పాండిచ్చేరి, అస్సామ్ లలో కూడా అదేరోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. కాగా, పశ్చిమ బెంగాల్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తొలిదదశ, ఏప్రిల్ 29న మలిదశ పోలింగ్ ఇక్కడ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి మే 4న జరుగుతుంది.