CC TV Hacking: సీసీటీవీ ఫుటేజ్ పాకిస్థాన్ పంపుతున్న ముఠా అరెస్ట్.. కేంద్రం కీలక చర్యలు..
CC TV Hacking: ఘజియాబాద్‌లో సీసీటీవీ ఫుటేజీని పాకిస్థాన్‌కు పంపుతున్నముఠా పట్టుబడింది. దేశవ్యాప్త సీసీటీవీ ఆడిట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
C TV Hacking
CC TV Hacking: ఈ మధ్య ఒక పెద్ద గూఢచర్య ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా దేశంలోని కీలకమైన ప్రదేశాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ ను హ్యాక్ చేస్తారు. వారు ఈ ఫుటేజీని పాకిస్థాన్ పంపుతున్నట్టు దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఈ ముఠా చిక్కింది. ఇంకా దేశంలో ఇలాంటి ముఠాలు చాలానే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.
కేంద్రం అప్రమత్తం..
ఈ ఘటన తరువాత దేశవ్యాప్తంగా సీసీటీవీ నెట్‌వర్క్‌లను ఆడిట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హోం మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఇతర ఏజెన్సీల సహకారంతో దేశవ్యాప్తంగా సీసీటీవీ నెట్‌వర్క్‌ల ఆడిటింగ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.
అలా అయితేనే..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి, ప్రభుత్వ భద్రతా తనిఖీలలో (STQC సర్టిఫికేషన్) పాస్ అయిన హ్యాక్-ప్రూఫ్ కెమెరాలను మాత్రమే విక్రయిస్తారు. భారతదేశంలోని 80% కెమెరాలు చైనా నుంచి వస్తున్నాయి. దీనివల్ల డేటా దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం, ఏడు కంపెనీలకు చెందిన 53 మోడళ్లు మాత్రమే భారత ప్రభుత్వ ధ్రువీకరణ పొందాయి. అవి మాత్రమే సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు.
సామాన్య ప్రజల గోప్యతకు కూడా ముప్పు..
సీసీటీవీ వ్యవస్థల నుండి వ్యక్తిగత డేటా లీక్ అయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. విఐపిల కదలికలను గమనించడానికి ఇరాన్ ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ హ్యాక్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. వాటి ఆధారంగానే ఖమేనీ, ఇతర నాయకులను కచ్చితంగా ఎక్కడ ఉన్నారనేది గుర్తించారనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, సోనిపట్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి నిఘా వ్యవస్థను హ్యాక్ చేశాడు. దానిద్వారా లైవ్ కెమెరా ఫీడ్‌ను యాక్సెస్ చేసి, ప్రయాణికుల ఫుటేజీని రికార్డ్ చేశాడు. ఈ ఫుటేజ్ ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నాడు. ఇది గోప్యతను స్పష్టంగా ఉల్లంఘించడమే. 2023 డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి గుర్తింపును బయటపెట్టగల ఫుటేజీని దుర్వినియోగం చేయడం చట్టవిరుద్ధం.
భారతదేశం నుండి పాకిస్తాన్‌కు ఫుటేజ్ ఎలా పంపారు?
ఇటీవల, ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ ప్రాంతంలో ఒక బీట్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో గూఢచర్య కేసు వెలుగులోకి వచ్చింది. సున్నితమైన ప్రాంతాల చుట్టూ సౌరశక్తితో పనిచేసే చిన్న కెమెరాలను అమర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కెమెరాలను ఇంటర్నెట్ ద్వారా విదేశీ సర్వర్లకు అనుసంధానించి, వాటి ప్రత్యక్ష ప్రసారాలను నేరుగా పాకిస్థాన్‌కు పంపడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు ముప్పు తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్‌లో మహిళలు, మైనర్లు కూడా ఉన్నారు. పలు కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
ప్రామాణిక ప్రోటోకాల్‌ల కొరత
దేశవ్యాప్తంగా వివిధ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ఏకీకృత డేటాబేస్ లేదా స్పష్టమైన నియంత్రణ వ్యవస్థ లేదని దర్యాప్తులో వెల్లడైంది. ఫలితంగా, అనేక నిఘా వ్యవస్థలు లోపభూయిష్టంగా ఉండి, భద్రతాపరమైన ప్రమాదాలను కలిగిస్తున్నాయి.
సీసీటీవీ కెమెరాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు
- మీ ఇల్లు, దుకాణం లేదా సంస్థలో సీసీటీవీని అమర్చినట్లయితే, మీరు సీసీటీవీ నిఘాలో ఉన్నారని తెలియజేసే నోటీసు బోర్డును కూడా పెట్టడం అవసరం.
- సీసీటీవీ ఫుటేజీని గరిష్టంగా 90 రోజుల వరకు భద్రపరచాలి. ఆ తర్వాత దానిని తొలగించవచ్చు.
- సోషల్ మీడియాలో సీసీటీవీ ఫుటేజీని అప్‌లోడ్ చేయడం చట్టరీత్యా నేరం.
- పొరుగువారి ఇంటికి ఎదురుగా సిసిటివి కెమెరాలను అమర్చకూడదు. ఇది గోప్యతకు భంగం కలిగిస్తుంది.
భారతదేశంలో కెమెరాలకు STQC ధృవీకరణ
STQC అనగా స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ అనేది భారత ప్రభుత్వ సంస్థ. ఇది ఎలక్ట్రానిక్, ఐటి ఉత్పత్తుల నాణ్యత, భద్రత, విశ్వసనీయతను తనిఖీ చేస్తుంది.
ఇది సమాచార - ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సిసిటివి కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నాణ్యత నియంత్రణ సాఫ్ట్‌వేర్, వ్యవస్థలు, ఇంకా సైబర్‌సెక్యూరిటీ.. డేటా రక్షణను పరీక్షించడం దీని విధి.