Delhi Negligence: అధికారుల నిర్లక్ష్యానికి బలైపోయిన బైకర్.. వాటర్ బోర్డు తవ్విన గొయ్యిలో పడి మృతి!
Delhi Negligence: దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.
Delhi Negligence: దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రోడ్డుపై తవ్వి వదిలేసిన గొయ్యి ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. జనక్‌పురి ప్రాంతంలో వాటర్ బోర్డు పనుల కోసం తవ్విన లోతైన గుంతలో పడి ఓ బైకర్ దుర్మరణం చెందాడు. మృతుడిని కైలాష్‌పురి నివాసి కమల్‌గా గుర్తించారు.
అసలేం జరిగింది?
కమల్ రోహిణి ప్రాంతంలో తన వ్యక్తిగత పని ముగించుకుని రాత్రి సమయంలో బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. జనక్‌పురి వద్దకు రాగానే, రోడ్డుపై వాటర్ బోర్డు పనుల కోసం తవ్విన బహిరంగ గొయ్యిని అతను గమనించలేదు. రాత్రి కావడంతో అది కనిపించకపోవడంతో నేరుగా బైక్‌తో సహా ఆ గుంతలో పడిపోయాడు. గొయ్యి చాలా లోతుగా ఉండటం, తలకు తీవ్ర గాయాలు కావడంతో కమల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వెలుగులోకి వచ్చిందిలా..
రాత్రి ఎంతకీ కమల్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు జనక్‌పురిలోని గొయ్యిలో కమల్ మృతదేహం, అతని బైక్ లభించాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరమైన గుంతలు తవ్వినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.