సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన నిలిపివేత
కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏడాది అవార్డుల ప్రకటనను నిలిపివేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గురువారం జరగవలసిన సాహిత్య అకాడమీ వార్షిక అవార్డులను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని రద్దు చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏడాది అవార్డుల ప్రకటనను నిలిపివేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గురువారం జరగవలసిన సాహిత్య అకాడమీ వార్షిక అవార్డులను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని రద్దు చేసింది. దాంతో గందరగోళం నెలకొంది.
సాహిత్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు సమావేశం తర్వాత ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం జరగాల్సి ఉంది. సమావేశం ప్రారంభమయ్యే నిమిషాల ముందు, ప్రెస్ మీట్ రద్దు చేసినట్లు, అవార్డుల ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రకటించారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అకాడెమీకి ఒక నోట్ పంపింది. దాని కింద ఉన్న నాలుగు స్వయంప్రతిపత్తి సంస్థలు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీలతో సంతకం చేసిన అవగాహన ఒప్పందం (MoU) గురించి గుర్తుచేస్తూ, అవార్డుల పునర్నిర్మాణానికి మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఒక ప్రక్రియ చేపట్టాలని కోరింది. జూలైలో ఈ అవగాహన ఒప్పందంపై అందరూ సంతకం చేశారు.
పునర్నిర్మాణ ప్రక్రియను మంత్రిత్వ శాఖ ఆమోదించే వరకు, ముందస్తు అనుమతి లేకుండా అవార్డుల ప్రకటన కోసం ఎటువంటి ప్రక్రియను చేపట్టకూడదని మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ ఏడాది అవార్డుల ప్రకటనకు ముందే అవార్డు జాబితా ఒక ఆంగ్ల పత్రికకు లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయమై దేశవ్యాప్తంగా సాహిత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.