ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు : కొండా దంపతులు

Update: 2018-12-22 10:18 GMT

పదవుల కంటే.. తమకు ప్రజలే ముఖ్యమని కొండా దంపతులు తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కొండా మురళీ రాజకీయ విలువలకు కట్టుబడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్రశ్నించే వారిని అసెంబ్లీలోకి రాకుండా చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని కేసీఆర్‌పై కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ సంచలనం రేపుతున్నాయి. 

టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కొండా మురళీ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన మండలి ఛైర్మెన్‌ స్వామిగౌడ్‌కు తన రాజీనామా లేఖను అందించారు. ఎన్నికల సమయంలో తన భార్య కొండా సురేఖకు టీఆర్ఎస్‌ టిక్కెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మురళి కూడా కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేశారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ నాయకులు చేసిన ఫిర్యాదుపై స్పందన తెలపాలంటూ కొండా మురళికి ఛైర్మెన్‌ స్వామిగౌడ్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. విలువలకు కట్టుబడే తన పదవిని వదులుకున్నా అన్న మురళి పదవుల కంటే ప్రజలే ముఖ్యమన్నారు. తమ రాజకీయ శత్రువైన ఎర్రబెల్లిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడంతోనే పార్టీని వీడామన్నారు. 

ప్రశ్నించే వారిని అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని సీఎం కేసీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. పరకాలలో తనను ఓడించడానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న ఆమె అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్‌ గెలిచిందన్నారు. కేవలం ఎర్రబెల్లి దయాకర్‌రావును మంత్రిని చేసేందుకు జూపల్లిని ఓడించారని ఆరోపించారు. ఇప్పటివరకు తమకు ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు వచ్చాయన్న కొండా దంపతులు ఇక నుంచి కూడా తాము ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. 

Similar News