Maoist Party Letter: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌లో 16 మంది మావోయిస్టుల అరెస్ట్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేశారు. టీజీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రిలీజ్ అయ్యింది. కకర్ బుడ్డి, బాబ్జీ పేట్ గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మావోయిస్టుల అరెస్ట్‌ను తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల అభిష్టానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించింది. ఫాసిస్టు బీజేపీ రూపొందించిన కగార్ యుద్ధానికి మద్దతు ఇవ్వొదని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది.
తెలంగాణలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు నుంచి కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కొనసాగేందుకు వీలుగా ఆందోళనలు చేపట్టాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు వీలుగా ఉద్యమించాలని పిలుపునిస్తున్నామని లేఖలో పేర్కొంది. మావోయిస్టు ముక్త్ ప్రతిపక్ష ముక్త్ లక్ష్యంతో కగార్ యుద్ధాన్ని అమలు చేస్తోందని లేఖలో విమర్శించింది.
ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, ఏక్ చునావ్, ఏక్ పార్టీ నినాదాలతో దేశంలోని అన్ని పార్టీలను నిర్వీర్యం, నిర్మూలన చేసే పథకం ప్రకారం ముందుకు పోతుందని విమర్శించింది. ఎలక్షన్ కమిషన్, కోర్టులు, సీబీఐ, ఎన్ఐఏ, ఇతర రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను తన కంట్రోల్‌లో పెట్టుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతర వేసిందని..దానికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణగా వెల్లడించింది. వారు కొనసాగిస్తున్న ఆర్థిక పాలసీలు కార్పొరేట్ల ప్రయోజనాలకు మాత్రమే అని..వారు తెస్తున్న పాలసీలు, చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు అన్ని వర్గాలకు ప్రమాదకరమే అని లేఖలో తెలిపింది. అందరూ ఏకమై ఆర్‌ఎస్‌ఎస్ - బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామని తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖలో పేర్కొంది.