తెలంగాణలో ముగిసిన పంచాయతీ పోరు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈ నెల 11న ఫస్ట్ ఫేజ్, 14న సెకండ్ ఫేజ్, 17న థర్డ్ ఫేజ్ పోలింగ్ జరిగింది.
హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈ నెల 11న ఫస్ట్ ఫేజ్, 14న సెకండ్ ఫేజ్, 17న థర్డ్ ఫేజ్ పోలింగ్ జరిగింది. అక్కడకక్కడ చెల్లాచెదురు ఘటనలు మినహా మూడు దశల పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలక్షన్ కమిషన్, పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఎన్నికల సంఘం అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు . కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మూడో విడతలో 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఎన్నికల కమిషనర్ తో కలసి పోలింగ్ సరళిని పరిశీలించిన సీఎస్, డీజీపీ
రాష్ట్రంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మూడవ విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డిలు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినితో పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో టెక్నాలజీ వాడటం వల్ల గ్రామాలలో శాంతిభద్రత సమస్య తగ్గుతుందని, దీని వలన ప్రజలలో ఎన్నికలపై నమ్మకం కలిగి పోలింగ్ శాతం పెరిగే అవకాశముంటుందన్నారు. మొదటి, రెండు దశలలో జరిగిన పోలింగ్‌తో పోలిస్తే మూడవ దశలో పోలింగ్ శాతం పెరిగే అవకాముందని ఆయన తెలిపారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లను, అధికారులను, పోలింగ్‌సిబ్బందిని సిఎస్ అభినందించారు. కాగా గ్రామ పంచాయతీరాజ్ ఎన్నికలకు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీజన, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరందం తదితరులు పాల్గొన్నారు.