Stray Dogs : కుక్కలను చంపేందుకు రూ.18 వేల సుపారీ..సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై కేసు

కుక్కలను చంపేందుకు రూ.18 వేల సుపారీ..సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై కేసు

Update: 2026-02-01 04:20 GMT

Stray Dogs : తెలంగాణలో మూగజీవాల పట్ల జరుగుతున్న పైశాచికత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీధి కుక్కల బెడదను నివారించే సాకుతో వాటిని అత్యంత క్రూరంగా చంపేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే సుమారు 1,500 కుక్కలను విషం ఇచ్చి చంపేశారన్న వార్త జంతు ప్రేమికులను, సామాన్య ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల పట్ల జరుగుతున్న అమానుషత్వం జంతు సంరక్షణ గ్రూపుల ద్వారా బయటపడింది. నాగర్‌కర్నూల్, సిద్ధిపేట జిల్లాల్లో పెద్ద ఎత్తున కుక్కలను విషం పెట్టి చంపడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మేపల్లి గ్రామంలో గత పది రోజుల్లోనే సుమారు 100 కుక్కలను విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారని సమాచారం. దీనిపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ముదావత్ ప్రీతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు జనవరి 27న కేసు నమోదు చేశారు.

ఈ దారుణం వెనుక గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఉన్నట్లు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. కుక్కలను చంపేందుకు ప్రత్యేకంగా వేటగాళ్లను పిలిపించారని, వారికి సుమారు రూ.18,000 చెల్లించినట్లు ఒక ఆడియో రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. సర్పంచ్ స్వయంగా ఆడియోలో కుక్కలను విషపు ఇంజెక్షన్లతో చంపించినట్లు ఒప్పుకోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇలా పద్దతి ప్రకారం జీవహింసకు పాల్పడటం జంతు సంరక్షణ చట్టాలను కాలరాయడమేనని కార్యకర్తలు మండిపడుతున్నారు.

మరోవైపు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో కూడా ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. ఇక్కడ సుమారు 50 కుక్కలను బంధించి, చట్టవిరుద్ధంగా దగ్గరలోని అడవుల్లో వదిలేశారు. కుక్కలను ఒక చోట నుంచి మరో చోటికి తరలించడం కూడా నేరమని జంతు సంరక్షణ నిబంధనలు చెబుతున్నా, అధికారులు వీటిని బేఖాతరు చేస్తున్నారు. ఒకవైపు వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని సామాన్యులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు వాటిని ఇలా క్రూరంగా చంపడం ఏంటని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని నియమ నిబంధనల ప్రకారం కుక్కలకు సంతానోత్పత్తి నియంత్రణ ఆపరేషన్లు చేయించాలని, ఇలా చంపడం పరిష్కారం కాదని వారు సూచిస్తున్నారు.

Tags:    

Similar News