Telangana: తెలంగాణ రైజింగ్ కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం - మంత్రి వివేక్ వెంకటస్వామి

Telangana: తెలంగాణ రైజింగ్ ద్వారా కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

Update: 2026-03-19 09:59 GMT

 Telangana: తెలంగాణ రైజింగ్ కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం - మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని, ‘తెలంగాణ రైజింగ్’ ద్వారా భవిష్యత్తులో కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక క్రమశిక్షణను ఆయన వివరించారు.

రెవల్యూషన్ బడ్జెట్‌కు సిద్ధం

డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈసారి అసెంబ్లీలో ఒక ‘రెవల్యూషన్ బడ్జెట్’ (విప్లవాత్మక బడ్జెట్) ప్రవేశపెట్టబోతున్నారని మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై దాదాపు 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపిందని ఆయన విమర్శించారు. అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ, సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'ప్రజా ఆమోద బడ్జెట్'ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

వడ్డీల రూపంలోనే రూ. 3 లక్షల కోట్లు

గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు సంబంధించి గత రెండు ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా వడ్డీలు చెల్లించాల్సి వచ్చిందని మంత్రి వివరించారు. కేవలం అప్పుల మిత్తిల (వడ్డీల) కోసమే దాదాపు రూ. 3 లక్షల కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించిందని ఆయన కీలక గణాంకాలను వెల్లడించారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా ఇందిరమ్మ రాజ్యంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News