జూలో కూలర్లు... మూగజీవులకు ఉపశమనం

Update: 2018-05-11 09:05 GMT

45 డిగ్రీలను దాటుతున్న ఉష్ణోగ్రతలకు.. మనుషులే మాడిపోతున్నారు. వేడిగాలులు కూడా తోడవడంతో.. ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. భానుడి భగభగలకు మన సంగతి సరే సరి. మరి జంతువుల పరిస్థితి ఏంటి..? జూలో ఎండిపోయిన చెట్ల నీడలో ఉండలేకపోతున్న మూగజీవుల రక్షణకు.. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎయిర్ కూలర్లతో ఉపశమనం కలిగిస్తున్నారు. 

ఎయిర్ కూలర్ గాలికి అలవాటు పడ్డ ఈ పులి.. రూమ్ నుంచి వెళ్లట్లేదు. అడుగు కూడా బయటపెట్టడం లేదు. గదిలోనే ఉంటూ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తోంది. సూర్యుడి ప్రతాపం చూపే ఎండాకాలంలో.. జూలోని జంతువులు అల్లాడిపోతున్నాయి. అటు బయటకు వెళ్లలేక.. ఇటు షెడ్డుల్లో ఉండలేక నరకాన్ని అనుభవిస్తున్నాయి. దీంతో జూ అధికారులు వేసవికాలంలో రక్షణ ఏర్పాట్లు చేశారు. వడదెబ్బ నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 

ప్రధానంగా వన్య ప్రాణుల పంజరాల ప్రాంగణాల్లో చల్లని వాతావరణం కల్పించేందుకు భారీ సన్నాహాలు చేశారు. వన్య ప్రాణులు తిరుగాడే పరిసరాల్లో జలాశయాలు ఏర్పాటు చేయడంతో పాటు.. తాగు నీరు సదుపాయాల్ని కల్పించారు. ఇటు పలుచోట్ల గడ్డి చాపలు వేశారు. ఎయిర్ కూలర్లను అమర్చి.. చల్లటి గాలులను అందిస్తున్నారు. మరోవైపు రాత్రింబవళ్లు వాతావరణం చల్లగా ఉండేందుకు పిచికారితో నీరు చిమ్మడం వంటి రక్షణ చర్యలు తీసుకున్నారు. ఇటు వాటికి అందించే ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 

Similar News