రేపు ఢిల్లీకి చంద్రబాబు.. ఏం జరగబోతోంది?

Update: 2018-10-26 12:00 GMT

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్ గరుడ అంశాలను ఆయన దేశం దృష్టికి తీసుకురానున్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటుందని సీరియస్‌గా ఉన్న చంద్రబాబు కేంద్రం ఏపీకి మొండిచేయి, విభజన హామీలు నెరవేర్చకపోవడం, తిత్లీ తుపానుపై స్పందించకపోవడం లాంటి అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంపై కేంద్రం కుట్రలను ఢిల్లీ వేదికగా వినిపించేందుకు ఆయన హస్తినకు పయనంకానున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్‌ గరుడ తదితర అంశాలను సీఎం దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ వేదికగా సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపడం, తిత్లీ తుఫానుపై స్పందించకపోవడం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై ఢిల్లీ వేదిక నుంచి ఆయన కేంద్రాన్ని నిలదీయనున్నారు.

మరోవైపు, గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గవర్నర్ వ్యవస్థపై పోరాటం చేసిన ఆయన సర్కారియా కమిషన్ వేసేలా చేశారు. ఇప్పుడు జగన్ దాడి వ్యవహారంలో డీజీపీకి గవర్నర్ ఫోన్ చేసి నివేదిక అడగడాన్ని తప్పుబడుతున్నారు. కేంద్రానికి గవర్నర్ గూఢచారిలా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
 

Similar News