ప్రజలకు ఆదాయపన్ను శాఖ బంపరాఫర్‌...ఆ సమాచారం ఇస్తే 5 కోట్ల రూపాయలు బహుమతి

Update: 2018-06-02 12:11 GMT

ప్రజలకు ఆదాయపన్ను శాఖ బంపరాఫర్‌ ఇచ్చింది. బినామీ లావాదేవీలు, బినామీ ఆస్తులు సమాచారం ఇచ్చిన వారికి ....కోటి రూపాయల బహుమతిని అందించాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉన్న దాచుకున్న నల్లధనం సమాచారం చెబితే....5 కోట్ల రూపాయలు బహుమతి అందించనుంది ఆదాయపు పన్ను శాఖ. 

ఎవరైనా బినామీ లావాదేవీలు నిర్వహించినా... బినామీ ఆస్తులున్న వారి సమాచారం ఇచ్చే వారికి నగదు బహుమతి అందించాలని ఆదాయపు పన్ను నిర్ణయించింది. విదేశాల్లో దాచిన బ్లాక్‌మనీ  వివరాలు ఇస్తే...5 కోట్ల రూపాయల దాకా బహుమతి లభించనుంది. విదేశాలకు సంబంధించిన వ్యక్తులూ....ఈ సమాచారాన్ని ఇచ్చి బహుమతి తీసుకోవచ్చని ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖలోని బహుమతులు ఇచ్చే పథకంలో కీలక మార్పులు చేస్తూ...సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్‌ ప్రకటించింది. 

భారీ ఎత్తున పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారాన్ని చెప్పిన వారికి ఇచ్చే గరిష్ఠ బహుమతిని రూ.50 లక్షలకు పెంచారు. బినామీ ఆస్తుల నిషేధ చట్టం 2016 కింద శిక్షించదగ్గ వారి సమాచారం ఏదైనా ఉంటే జాయింట్‌ లేదా అడిషనల్‌ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బినామీ లావాదేవీలు, ఆస్తుల వెనుక అసలు పెట్టుబడి దారులు, వాటి నుంచి ఆదాయాన్ని పొందే నిగూఢ వ్యక్తుల సమాచారాన్ని వెలికితీసేందుకే ఈ రివార్డుల కార్యక్రమాన్ని చేపట్టారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరు. 

నల్లధనాన్ని ఉపయోగించి ఇతరుల పేర్లతో ఆస్తులు కొంటున్నారని, వాటిపైన వచ్చే ఆదాయాన్ని అసలు యజమానులే అనుభవిస్తున్నారని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. బినామీ లావాదేవీలను అరికట్టేందుకు ఆదాయ పన్ను శాఖ బినామీ కార్యకలాపాల సమాచారవేగుల బహుమతుల పథకాన్ని ప్రకటించింది. దేశంలో నల్లధనం నియంత్రణకు, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ చేపడుతోన్న చర్యల్లో ప్రజలు కూడా పాలుపంచుకునేలా చేయడమే ఈ ప్రోత్సాహక పథకం వెనక ప్రధాన ఉద్దేశమని సీబీడీటీ తెలిపింది. 

Similar News