సీఎంగా నేనే కొనసాగుతాను : సిద్ధరామయ్య
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించనున్నారని వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై స్పందించారు. రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
బెళగావి: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించనున్నారని వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై స్పందించారు. రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన తెగేసి చెప్పారు.
సీఎం పదవీకాలంపై విపక్షాలు పదేపదే ప్రశ్నిస్తుండటంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం నిర్ణయించేంత వరకూ తానే ముఖ్యమంత్రినన్నారు. ‘‘మొదట ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో శాసనసభ్యులు తమ నేతను ఎన్నుకున్నారు. ఆ తర్వాత అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ నేనే సీఎంను. అధిష్ఠానం నిర్ణయం తీసుకునేంత వరకూ సీఎంగానే కొనసాగుతాను’’ అని సిద్ధరామయ్య చెప్పారు. రెండున్నరేళ్ల పదవీకాలం గురించి తానెప్పుడూ చెప్పలేదని, అలాంటి ఒప్పందం కూడా ఏదీ లేదని ఆయన వివరణ ఇచ్చారు.
సీఎం మార్పుపై ఊహాగానాలు ఊపందుకోవడంతో పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. అందరూ కూర్చుని మాట్లాడుకోవాలని సూచించింది. దీంతో తొలుత సిద్ధరామయ్య డీకేను బ్రేక్‌ఫాస్ట్ కోసం తన ఇంటికి ఆహ్వానించారు. అనంతరం డీకే సైతం సిద్ధరామయ్యకు విందు ఇచ్చారు. దాంతో, సీఎం మార్పు ప్రచారానికి స్వస్తి పలికినట్లైందని భావిస్తున్నారు.