Budget 2026: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ఊరట – రూ.10,000 కోట్ల గ్రోత్ ఫండ్
Budget 2026లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.10,000 కోట్లు గ్రోత్ ఫండ్, కొత్త కెమికల్ పార్కులు, SMEలకు భారీ మద్దతు ప్రకటించబడింది.
Budget 2026: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ఊరట – రూ.10,000 కోట్ల గ్రోత్ ఫండ్
నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో, “దేశ సంస్కరణల రైలు ఆగలేదు, వేగంగా ముందుకు సాగుతోంది” అని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు మొదటి ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
నిర్మలమ్మ నాలుగోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించామని తెలిపారు. టెక్నాలజీ, తయారీ రంగ బలం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ఈ బడ్జెట్ ముఖ్య లక్ష్యాలు అని చెప్పారు.
ఆగస్టు 15 తర్వాత చేపట్టిన జీఎస్టీ మార్పులు, కొత్త కార్మిక చట్టాలు, నాణ్యత నియంత్రణ నిబంధనలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునికంగా మార్చే దిశలో అడుగులు అని ఆమె వివరించారు. ఈ నిర్ణయాల వల్ల వృద్ధి కొనసాగుతుందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు.
ప్రత్యేకంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద ఊరట కలిగించే విధంగా, భవిష్యత్తులో దేశానికి గర్వకారణమైన సంస్థలుగా ఎదగగల SMEలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్ల ప్రత్యేక గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే, దేశీయ తయారీని పెంపొందించేందుకు మూడు ప్రత్యేక కెమికల్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఖనిజ రంగానికి సంబంధించిన కొత్త వ్యూహాలనూ ఈ బడ్జెట్‌లో ఉంచారు. ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్‌లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు ప్రధాన స్థంభాలుగా ఉంటాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో పరిశోధన, ఆధునిక చిప్ తయారీ కేంద్రాలు, నిపుణుల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు.