తొమ్మిదేళ్ల ప్రేమ.. రెండు నెలల పెళ్లి: భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య!

Bareilly Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, పెళ్లయిన రెండు నెలలకే ఓ భార్య అతి దారుణంగా కడతేర్చింది.

Update: 2026-02-02 05:38 GMT

Bareilly Murder Case: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, పెళ్లయిన రెండు నెలలకే ఓ భార్య అతి దారుణంగా కడతేర్చింది. ఆర్థిక గొడవలే కారణమని చెబుతూ.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఇజ్జత్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రేమ వివాహం.. కట్ చేస్తే విషాదం:

ఎటావా జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ యాదవ్ (IVRI ఉద్యోగి), జ్యోతి (బస్ కండక్టర్) స్కూల్ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. సుమారు తొమ్మిదేళ్ల ప్రేమాయణం తర్వాత, ఇరు కుటుంబాలను ఒప్పించి గతేడాది నవంబర్ 25న వివాహం చేసుకున్నారు. బరేలీలో కాపురం పెట్టిన ఈ జంట జీవితంలో రెండు నెలలకే చిచ్చు రేగింది.

హత్యకు దారితీసిన రూ. 20 వేలు:

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జితేంద్ర తన భార్యకు తెలియకుండా ఆమె బ్యాంక్ ఖాతా నుండి రూ. 20,000 డ్రా చేసి ఆన్‌లైన్ జూదంలో పోగొట్టాడు. ఈ విషయంపై జనవరి 26న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన జ్యోతి.. తన తల్లిదండ్రులు, సోదరుడు దీపక్‌ను ఇంటికి పిలిపించింది. అందరూ కలిసి జితేంద్రపై దాడి చేయగా, చివరకు జ్యోతి స్వయంగా భర్త గొంతు నులిమి చంపేసింది.

ఆత్మహత్యగా చిత్రీకరణ.. పోస్ట్‌మార్టంతో గుట్టురట్టు:

హత్య చేసిన అనంతరం ఇది ఆత్మహత్య అని నమ్మించేందుకు జితేంద్ర మెడకు మఫ్లర్ చుట్టి కిటికీ గ్రిల్‌కు వేలాడదీశారు. తన భర్త ఉరివేసుకున్నాడంటూ జ్యోతి నాటకమాడింది. అయితే, జితేంద్ర సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు. నివేదికలో అది ఆత్మహత్య కాదని, గొంతు నులపడం వల్లే మరణించాడని తేలడంతో పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది.

ప్రస్తుతం పోలీసులు జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News