బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత
భారతపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ జనాదరణ పొందిన ఇక్వింలాబ్ మంచ్ సంస్థ నాయకుడు ఉస్మాన్ హైదీ మృతి వార్త నిన్న బంగ్లాదేశ్‌లో కలకలం రేపింది. ఆందోళనకారులు రాత్రి వేళ ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు.
ఢాకా: భారతపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ జనాదరణ పొందిన ఇక్వింలాబ్ మంచ్ సంస్థ నాయకుడు ఉస్మాన్ హైదీ మృతి వార్త నిన్న బంగ్లాదేశ్‌లో కలకలం రేపింది. ఆందోళనకారులు రాత్రి వేళ ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. కొన్ని స్థానిక పత్రికలకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. కార్యాలయాల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఇక చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఎదుట కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజీబ్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. మరోవైపు పరిస్థితి అదుపు చేసేందుకు ప్రభుత్వం పారామిలిటరీ దళాలు కూడా మోహరించాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన కాల్పుల్లో హైదీ గాయపడ్డ విషయం తెలిసిందే. సింగపూర్‌లో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ రోజు సాయంత్రం హైదీ మృత దేహాన్ని బంగ్లాదేశ్‌కు తీసుకువస్తారని తెలియడంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతీయులకు హైకమిషన్ జాగ్రత్తలు
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత హైకమిషన్ అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లోని భారతీయులు ఇళ్లల్లోంచి అనవసరంగా బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లోని హైకమిషన్ లేదా అసిస్టెంట్ హైకమిషన్‌ను సంప్రదించాలని సూచించింది.