Tragedy : తీవ్ర విషాదం..గని కూలి 200 మందికి పైగా మృతి

తీవ్ర విషాదం..గని కూలి 200 మందికి పైగా మృతి

Update: 2026-01-31 03:10 GMT

Tragedy : కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ తూర్పు ప్రాంతంలోని రుబాయాలో ఉన్న ఒక భారీ కోల్టాన్ గని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమారు 200 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం అందుతోంది. బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఉత్తర కివు ప్రావిన్స్‌లో ఉన్న రుబాయా కొల్టాన్ గని ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. అయితే, గత బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఈ గని ఒక్కసారిగా కుప్పకూలింది. గనిలో పని చేస్తున్న కార్మికులతో పాటు, అక్కడ వ్యాపారం చేసుకునే మహిళలు, చిన్న పిల్లలు కూడా ఈ ప్రమాదంలో మరణించారని స్థానిక గవర్నర్ ప్రతినిధి లుముంబా కాంబెరే ముయిసా ధృవీకరించారు. వర్షాల వల్ల భూమి మెత్తబడటంతో కొండచరియలు విరిగిపడి కార్మికులు ఉన్న లోతైన గుంతలను కప్పేశాయి. సుమారు 200 మందికి పైగా సజీవ సమాధి అయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాంతం ఎం23 అనే తిరుగుబాటు గ్రూపు నియంత్రణలో ఉండటంతో సహాయక చర్యలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. శిథిలాల నుంచి ఇప్పటివరకు కొన్ని మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. గాయపడిన సుమారు 20 మందికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. లోపల ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని, వారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని గని కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కనీసం ఆధునిక యంత్రాలు కూడా లేకపోవడంతో చేతులతోనే మట్టిని తొలగిస్తూ తమ తోటి వారి కోసం వెతుకుతున్నారు.

రుబాయా గని ప్రపంచానికి కావలసిన కొల్టాన్ ఖనిజంలో 15 శాతాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనం వాడే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఏరోస్పేస్ విడిభాగాల తయారీలో వాడే టాంటాలమ్ లోహం ఈ కొల్టాన్ నుంచే వస్తుంది. ఇంతటి విలువైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ, ఇక్కడ పని చేసే కార్మికులు రోజుకు కేవలం రెండు, మూడు డాలర్ల కోసమే ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. ఈ ఖనిజ సంపద కోసమే ప్రభుత్వం, తిరుగుబాటు దళాల మధ్య ఏళ్ల తరబడి యుద్ధం జరుగుతోంది. ఎం23 తిరుగుబాటుదారులు ఈ ఖనిజాలను అమ్మి తమ సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి ఆరోపిస్తోంది.

కాంగోలో గని ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు, కానీ ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం అందరినీ కలిచివేస్తోంది. దేశం అపారమైన ఖనిజ సంపదతో తులతూగుతున్నా, అక్కడి ప్రజల్లో 70 శాతం మంది పేదరికంలోనే మగ్గిపోతున్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీల అవసరాల కోసం అభాగ్యులు మృత్యువాత పడటంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ గని కూలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వెనుక ఉన్న చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది.

Tags:    

Similar News