US Winter Storm:అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను..29మంది మృతి, అంధకారంలో 6 లక్షల ఇళ్లు

అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను..29మంది మృతి, అంధకారంలో 6 లక్షల ఇళ్లు

Update: 2026-01-27 05:50 GMT

US Winter Storm:అగ్రరాజ్యం అమెరికాను ప్రకృతి ప్రకోపం వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా వీస్తున్న శక్తివంతమైన మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ గడ్డకట్టే చలికి, మంచు వర్షానికి ఇప్పటివరకు సుమారు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని తూర్పు, దక్షిణ రాష్ట్రాలు మంచు దుప్పటి కింద కూరుకుపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడమే కాకుండా, లక్షలాది ఇళ్లు అంధకారంలో మునిగిపోయాయి. మంచు తుపాను దాటికి అమెరికా అతలాకుతలం అవుతున్న ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక కథనం.

అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 1,300 మైళ్ల మేర భారీగా మంచు పేరుకుపోయింది. పిట్స్‌బర్గ్ వంటి ప్రాంతాల్లో ఏకంగా 20 ఇంచుల మేర మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మంచును తొలగించే క్రమంలోనూ, మంచుపై జారి పడటం వల్ల కూడా అనేక మరణాలు సంభవించాయి. న్యూయార్క్ నగరంలో కేవలం ఒకే వారంలో ఎనిమిది మంది చలికి తట్టుకోలేక వీధుల్లోనే మరణించడం అక్కడి తీవ్రతను తెలియజేస్తోంది.

మంచు తుపాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో టెక్సాస్, మిసిసిపీ వంటి రాష్ట్రాల్లో సుమారు 6.7 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మిసిసిపీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. 1994 తర్వాత ఆ రాష్ట్రం చూస్తున్న అత్యంత భయంకరమైన విపత్తు ఇదే. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన వార్మింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితులకు దుప్పట్లు, ఆహారం అందిస్తోంది. అనేక యూనివర్సిటీలు, స్కూళ్లకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

రవాణా రంగం విషయానికి వస్తే.. పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 8 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు కావడం లేదా ఆలస్యంగా నడుస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఒక్కరోజులో ఇన్ని విమానాలు రద్దు కావడం ఇదే మొదటిసారి అని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. హైవేలన్నీ మంచుతో నిండిపోవడంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. 2014 తర్వాత అమెరికాలో ఇంతటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రానున్న మరికొన్ని రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News