పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్‌పై ఏకంగా రూ. 55 పెంపు.. చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు!
Pakistan Petrol Diesel Price Hike: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను 'పెట్రో' సెగ మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్‌పై ఏకంగా రూ. 55 పెంపు.. చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు!
Pakistan Petrol Diesel Price Hike: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను 'పెట్రో' సెగ మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల నుంచి తినుబండారాల వరకు ప్రతి వస్తువు ధర అమాంతం పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క ప్రకటన.. అన్నీ ప్రియం!
ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా 55 పాకిస్థానీ రూపాయలను (PKR) పెంచుతూ ఈ నెల 7న నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటన వెలువడిన గంటల్లోనే మార్కెట్‌లో ధరల వేట మొదలైంది.
నిత్యావసరాలు నూడుల్స్, టూత్‌పేస్ట్, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి వస్తువులపై రూ. 10 వరకు ధరలు పెరిగాయి. రవాణా ఖర్చులు పెరగడంతో పప్పుల ధర కిలోకు రూ. 15 నుండి 20 వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. కూరగాయల సరఫరా బాగానే ఉన్నప్పటికీ, హోల్‌సేల్ మార్కెట్‌లో కమిషన్ ఏజెంట్ల ప్రభావంతో టమాటా, మిర్చి ధరలు విపరీతంగా పెరిగాయి.
రవాణా భారమే కారణమంటున్న వ్యాపారులు
పాత స్టాక్‌ను కూడా కొత్త ధరలకే విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తుండగా, వ్యాపారులు మాత్రం తమను తాము సమర్థించుకుంటున్నారు. రవాణా మరియు పంపిణీ ఖర్చులు పెరగడం వల్ల ధరలు సర్దుబాటు చేయక తప్పడం లేదని వారు చెబుతున్నారు. "ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం వల్ల మార్కెట్ అల్లకల్లోలమైంది" అని ఆబ్‌పారా మార్కెట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
యుద్ధం తెచ్చిన ఇబ్బందులు
అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశం కావడంతో, ఆ భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపాల్సి వచ్చింది. అయితే, ఈ రూ. 55 పెంపు అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.