Iran vs USA : ప్రపంచ యుద్ధానికి తెరలేపుతున్న అమెరికా? గాలి కూడా భయపడే విధంగా సైనిక మోహరింపు

Iran vs USA : ఇరాన్ ముప్పును అడ్డుకునేందుకు అమెరికా 2,500 మంది మెరైన్ సైనికులను, యూఎస్‌ఎస్ ట్రిపోలీ యుద్ధనౌకను మిడిల్ ఈస్ట్‌కు పంపుతోంది. హోర్ముజ్ జలసంధి రక్షణే లక్ష్యంగా అగ్రరాజ్యం ఈ భారీ సైనిక మోహరింపు చేపట్టింది.

Update: 2026-03-14 01:53 GMT

US Sends 2,500 Marines Warship

Iran vs USA : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా అత్యంత కీలకమైన సైనిక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడమే లక్ష్యంగా సుమారు 2,500 మంది మెరైన్ సైనికులను, భారీ యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలీని ఆ ప్రాంతానికి తరలిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, సముద్ర మార్గాలను రక్షించడానికి, అత్యవసర పరిస్థితుల్లో మెరుపు వేగంతో స్పందించడానికి పెంటగాన్ ఈ భారీ మోహరింపును చేపట్టింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని ఇరాన్ తీరాలకు చేరువగా మోహరిస్తోంది.

ఈ సైనిక మోహరింపులో ప్రధానంగా 31వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్కు చెందిన సైనికులు ఉన్నారు. వీరికి తోడుగా వెళ్తున్న యూఎస్‌ఎస్ ట్రిపోలీ యుద్ధనౌక చాలా శక్తివంతమైనది. ఇది కేవలం ఓడ మాత్రమే కాదు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, అత్యాధునిక సైనిక పరికరాలను మోసుకెళ్లే ఒక కదిలే సైనిక కేంద్రం. కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత ట్వంటీ నైన్ పామ్స్ శిక్షణ కేంద్రం నుంచి బయలుదేరిన ఈ దళాలు, సముద్రం ద్వారా దాడులు చేయడంలోనూ, ఆపదలో ఉన్న ప్రాంతాలకు తక్షణ మద్దతు అందించడంలోనూ ఆరితేరినవి. ఈ చర్యతో మిడిల్ ఈస్ట్‌లో అమెరికా సైనిక పట్టు మరింత బిగుసుకోనుంది.

అమెరికా ఇంతలా రియాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సింహభాగం ఈ సన్నని సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఇక్కడ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయి. ఇరాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల నౌకలను హైజాక్ చేయడం, క్షిపణి దాడులు జరపడం వంటి ఘటనలు పెరిగాయి. అందుకే, గ్లోబల్ ఎనర్జీ సప్లైకి ముప్పు కలగకుండా ఉండాలంటే ఇక్కడ సైనిక బలాన్ని పెంచడం తప్పనిసరి అని అమెరికా భావిస్తోంది.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం అమెరికా-ఇరాన్ మధ్యే కాకుండా, మొత్తం ప్రాంతీయ సుస్థిరతపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ నేతలపై అమెరికా భారీ రివార్డులు ప్రకటించడం, దానికి ప్రతిగా ఇరాన్ తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేయడం చూస్తుంటే పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. తాజా అమెరికా సైనిక మోహరింపు శాంతిని నెలకొల్పుతుందా లేక అగ్నికి ఆజ్యం పోస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News