Operation Sindoor : 88 గంటల యుద్ధం..పాక్ ఉగ్రస్థావరాల ధ్వంసం..ఆపరేషన్ సింధూర్ నిజాలు బయటపెట్టిన స్విస్ రిపోర్ట్
88 గంటల యుద్ధం..పాక్ ఉగ్రస్థావరాల ధ్వంసం..ఆపరేషన్ సింధూర్ నిజాలు బయటపెట్టిన స్విస్ రిపోర్ట్
Operation Sindoor : భారతీయ వాయుసేన పరాక్రమానికి పాకిస్థాన్ మరోసారి వణికిపోయింది. గతేడాది మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో వివరిస్తూ యూరోపియన్ మిలిటరీ విశ్లేషకులు ఒక సంచలన నివేదికను విడుదల చేశారు. కేవలం 88 గంటల పాటు సాగిన ఈ గగనతల యుద్ధంలో భారత వైమానిక దళం దెబ్బకు పాకిస్థాన్ మడమ తిప్పి, కదనరంగంలో మండీ నొక్కినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఈ మెరుపు దాడిని నిర్వహించింది.
గతేడాది మే 7న పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేయడంతో భారత్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెనువెంటనే ఆపరేషన్ సింధూర్ పేరిట భారీ వైమానిక దాడికి ప్రణాళిక రచించింది. మే 7 నుంచి 10 వరకు 88 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్ సరిహద్దు దాటి వెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను తుత్తునియలు చేశాయి. ముఖ్యంగా బహవల్పూర్, మురిడ్కేలలో ఉన్న హై-వాల్యూ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారత్ తన సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో నేలమట్టం చేసింది.
స్విట్జర్లాండ్‌కు చెందిన మిలిటరీ హిస్టరీ అండ్ పర్స్పెక్టివ్ స్టడీస్ సెంటర్ ప్రచురించిన ఈ నివేదికలో ప్రముఖ చరిత్రకారుడు ఆడ్రియన్ ఫాంటనెల్లాజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత దాడుల తీవ్రతకు పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆయన పేర్కొన్నారు. తమ వాయుసేన స్థావరాలు నిరంతరం ఒత్తిడికి గురవ్వడం, భారత క్షిపణుల దాడిని అడ్డుకోలేకపోవడంతో పాకిస్థాన్ ఏమీ చేయలేని స్థితికి చేరుకుంది. ఈ దెబ్బ నుంచి కోలుకోలేక, మరిన్ని దాడులు జరిగితే దేశం అల్లకల్లోలం అవుతుందని భయపడి పాక్ చివరకు కాల్పుల విరమణ కోసం వేడుకుందని నివేదిక స్పష్టం చేసింది.
భారత్ ఈ దాడిని అత్యంత రహస్యంగా, సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తమకు ఏమీ జరగలేదని, అడవుల్లో బాంబులు పడ్డాయని అప్పట్లో బుకాయించింది. కానీ యూరోపియన్ విశ్లేషణ ఇప్పుడు పాక్ అబద్ధాలను బట్టబయలు చేసింది. లష్కర్ కమాండర్లు కూడా ఈ దాడికి తాము దిగ్భ్రమ చెందామని అంగీకరించినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక ప్రతీకార చర్య మాత్రమే కాదని, భారత వ్యూహాత్మక సిద్ధాంతంలో ఒక పెద్ద మలుపు అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. శత్రువు ఇళ్లలోకి చొరబడి మరీ దెబ్బకొట్టే సత్తా భారత్‌కు ఉందని ఇది మరోసారి రుజువు చేసింది.
ఈ ఆపరేషన్ విజయంతో భారత వాయుసేన ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించింది. రఫేల్, సుఖోయ్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు తమ సత్తా చాటాయి. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ యుద్ధం ఒక పాఠంగా నిలిచింది. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ గురించి చర్చలు జరుగుతున్నాయి. పోలాండ్ వంటి దేశాలు కూడా పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని సూచించడం విశేషం.