USA-Iran: ఖమేనీ హెచ్చరికలకు ట్రంప్ కౌంటర్.. ‘రెండు రోజులు ఆగండి.. అసలు విషయం తెలుస్తుంది!’
USA-Iran: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది.
USA-Iran: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఖమేనీ చెప్పిన విషయాల్లో నిజమెంతో తేలడానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది?
తమ దేశంపై దాడికి పాల్పడితే అది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని, దాడి చేసే వారికి ఇరాన్ గట్టి బుద్ధి చెబుతుందని ఖమేనీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరికా తన యుద్ధనౌకలను పశ్చిమాసియాలోకి రంగంలోకి దించిన తర్వాత ఖమేనీ నేరుగా ట్రంప్ యంత్రాంగాన్ని హెచ్చరించడం ఇదే మొదటిసారి.
ట్రంప్ రియాక్షన్ ఏంటి?
ఫ్లోరిడాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. "ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ నౌకలు ప్రస్తుతం ఇరాన్‌కు అత్యంత సమీపంలో ఉన్నాయి. వచ్చే రెండు రోజుల్లో ఒక ఒప్పందం కుదరొచ్చని ఆశిస్తున్నాను. ఒకవేళ ఆ డీల్ కుదరకపోతే.. ఖమేనీ చెప్పిన మాటలు నిజమవుతాయో లేదో అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అమెరికా సైనిక కదలికలు, ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, అది పెను యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.