Hormuz :హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ టోల్ బాదుడు.. ఒక్క నౌకకు 18 కోట్లు
Hormuz Oil Crisis: హోర్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ తన విశ్వరూపం చూపిస్తోంది.
Hormuz Oil Crisis
ప్రపంచం ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ వైపు వెళ్తోంది. గత 20 రోజులుగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. అది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే చమురు.. హోర్ముజ్ జలసంధికి చేరింది. అగ్రనేతలు నేలకొరిగినా, ఆర్థిక ఆంక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
హోర్ముజ్ జలసంధి
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుంచి 30 శాతం ఈ ఇరుకైన జలసంధి గుండానే వెళ్లాలి. ఇరాన్ దీన్ని తన ఆయుధంగా మార్చుకుంది. ఇక్కడ ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత ఆసక్తికరంగా ఉంది. శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తూనే, తన మిత్ర దేశాల పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తోంది.యుద్ధ రంగంలో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలను ఎదుర్కోవడమే కాకుండా, సముద్ర మార్గంలో కూడా ఇరాన్ తన పట్టు నిరూపించుకుంటోంది.అమెరికా లేదా ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలు కనిపించగానే ఇరాన్ నౌకాదళం వాటిని అడ్డుకుంటోంది. దీనివల్ల సరఫరా గొలుసు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది.విచిత్రమేమిటంటే, అదే సమయంలో భారత్ వంటి మిత్ర దేశాలకు చెందిన నౌకలను మాత్రం ఇరాన్ ఏమాత్రం అడ్డుకోవడం లేదు. మీరు మా మిత్రులు, మీకు మా వల్ల ఎలాంటి ఆటంకం ఉండదు అన్న సంకేతాన్ని ఇరాన్ పంపుతోంది. దీనివల్ల భారత ఇంధన అవసరాలకు కొంత మేర భరోసా లభిస్తోంది.
ఒక్క ప్రయాణానికి రూ.18.7 కోట్లు
ప్రముఖ షిప్పింగ్ వార్తా సంస్థ లాయిడ్స్ లిస్ట్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. హోర్ముజ్ జలసంధి గుండా క్షేమంగా దాటడం కోసం ఒక చమురు నౌక ఏకంగా 2 మిలియన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.18.7 కోట్లు) ఇరాన్‌కు చెల్లించింది. యుద్ధం జరుగుతున్న వేళ తమ నౌకలపై దాడులు జరగకుండా, సురక్షితంగా గమ్యాన్ని చేరడానికి సదరు నౌక ఈ భారీ మొత్తాన్ని సమర్పించుకుంది. అయితే, ఈ సొమ్ము చెల్లించిన దేశం ఏది అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
షాకింగ్ నిజం
ఇరాన్ అగ్రనేతలను మట్టికరిపించామని అమెరికా భావిస్తున్నప్పటికీ, ఇరాన్ సైనిక వ్యవస్థ , వ్యూహకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాహ్య ప్రపంచానికి ఇరాన్ బలహీనపడినట్టు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పక్కా ప్లాన్‌తో శత్రువుల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. చమురు సరఫరాను అడ్డుకోవడం ద్వారా అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచడమే ఇరాన్ అసలు మాస్టర్ ప్లాన్.
ప్రపంచ మార్కెట్‌లో చమురు సెగలు
హోర్ముజ్ దగ్గర ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరాలో 10 శాతానికి పైగా కొరత ఏర్పడటంతో అన్ని దేశాలూ ఆందోళన చెందుతున్నాయి. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు.యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరగడం లేదు, అది ఇప్పుడు ప్రపంచం తాగే పెట్రోల్, డీజిల్ రేట్లలోనూ కనిపిస్తోంది. ఇరాన్ వేస్తున్న ఈ ఎత్తుగడలకు అగ్రరాజ్యం అమెరికా ఎలా బదులిస్తుందో చూడాలి. మిత్రదేశాల పట్ల కృతజ్ఞత, శత్రువుల పట్ల కఠినత్వం.. ఇరాన్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వ్యూహం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది.