Gas crisis: ప్రమాదంలో హోర్ముజ్ జలసంధి..గ్యాస్ ధరలు 25 శాతం పైకి

ఖతార్‌లోని కీలక గ్యాస్ హబ్‌పై దాడులు , హోర్ముజ్ జలసంధి మూతపడేలా కనిపిస్తుంది.

Update: 2026-03-20 06:04 GMT

Gas crisis: ప్రమాదంలో హోర్ముజ్ జలసంధి..గ్యాస్ ధరలు 25 శాతం పైకి

Natural Gas : అంతర్జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఖతార్‌పై జరిగిన దాడులు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వెరసి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచానికి ఇంధన భాండాగారంగా ఉన్న పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పుడు గ్యాస్ మంటలను రాజేస్తున్నాయి. ఖతార్‌లోని కీలకమైన గ్యాస్ హబ్‌ లక్ష్యంగా జరిగిన దాడులు అంతర్జాతీయ మార్కెట్‌ను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేశాయి. ఫలితంగా గ్యాస్ ధరలు కేవలం ఒక్కరోజులోనే 25 శాతం మేర పెరగడం గమనార్హం.

ఖతార్ హబ్‌పై దాడి

ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువును సరఫరా చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అలాంటి దేశంలోని కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం అంటే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును తెంచడమే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన ఇంధన కేంద్రాలపై పడింది.

హోర్ముజ్ జలసంధిపై నీలినీడలు

ప్రపంచ చమురు ,గ్యాస్ రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హోర్ముజ్ జలసంధి . ప్రపంచ ఇంధన రవాణాలో దాదాపు 20 శాతం వాటా ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇప్పటికే ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటగా, ఇప్పుడు గ్యాస్ ధరల పెరుగుదల ఆసియా , ఐరోపా దేశాల్లో విద్యుత్ ఉత్పత్తి ఖర్చులను భారీగా పెంచే ప్రమాదం ఉంది.

ట్రంప్ యంత్రాంగం రంగ ప్రవేశం

ఈ ఇంధన సంక్షోభాన్ని చల్లార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం ఇతర దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది. సరఫరా మార్గాల్లో అస్థిరత పోకపోతే గ్యాస్ కంపెనీలు తమ ఒప్పందాలను పున:సమీక్షించుకోక తప్పదు. ఇది నేరుగా గృహ వినియోగదారుల గ్యాస్ బిల్లులపై ప్రభావాన్ని చూపుతుంది. యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం సామాన్యుడి వంటగది వరకు చేరుతుందని ఈ గ్యాస్ ధరల పెరుగుదల మరోసారి నిరూపించింది. యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత ప్రియమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News