Strait of Hormuz: హోర్ముజ్ జలసంధి నుండి వెళ్లే ఓడలపై ఇరాన్ టాక్స్!
Strait of Hormuz: హెర్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి పట్టు సాధించింది. ఇప్పుడు దాని నుంచి వెళ్లే ప్రతి ఓడపై సుంకాలు విధించాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది.
Strait of Hormuz
Strait of Hormuz: అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడులను, బెదిరింపులను ప్రతిఘటిస్తున్న ఇరాన్, ఇప్పుడు హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించింది. ప్రపంచంలోని 20 శాతానికి పైగా చమురు, గ్యాస్ ఇదే హోర్ముజ్ జలసంధి గుండా ఓడల ద్వారా రవాణా అవుతుంది. ఇప్పుడు ఇరాన్ దీనిని తన ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం, హోర్ముజ్ జలసంధి నుండి అరేబియా సముద్రానికి చేరుకునే ఓడలపై రవాణా రుసుము విధించాలనే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.
హోర్ముజ్ జలసంధి చాలా ఇరుకైన జలమార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ - అరేబియా సముద్రాన్ని కలిపే జలమార్గం. సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుండి చమురు, గ్యాస్, ఇతర వస్తువులు ఈ జలమార్గం గుండా ఓడల ద్వారా రవాణా అవుతాయి. చాలా ఆసియా దేశాలు ఇక్కడ నుండి సరఫరా అయ్యే చమురు, గ్యాస్‌పై ఆధారపడి ఉన్నాయి. ఇది గల్ఫ్ దేశాలకు ప్రధాన ఆదాయ వనరు కూడా. అందువల్ల, హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా అమెరికా, గల్ఫ్ దేశాలకు దెబ్బకొట్టడానికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఒక నివేదిక ప్రకారం, ప్రతిరోజూ 15-20 చమురు ట్యాంకర్లతో సహా 100 నుండి 135 నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. ప్రపంచ చమురులో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఇది ఇరాన్‌కు తన పలుకుబడిని, శక్తిని విస్తరించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
హోర్ముజ్ జలసంధి గుండా చమురు మాత్రమే కాకుండా ఆహారం, ఇతర వస్తువులను కూడా తీసుకువెళ్లే అన్ని దేశాల నౌకలన్నీ ఇరాన్‌కు సుంకాలు, పన్నులు చెల్లించడాన్ని తప్పనిసరి చేసే ఒక బిల్లును రూపొందిస్తున్నారు. యుద్ధం తర్వాత, హోర్ముజ్ జలసంధిలో కొత్త నియంత్రణల వ్యవస్థను ప్రవేశపెడతారు. ఈ చట్టం, తమపై ఆంక్షలు విధించిన దేశాలపై ఇరాన్ జల పరిమితులను విధించడానికి వీలు కల్పిస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు తెలిపారు.
హోర్ముజ్ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అందువల్ల, ఇక్కడ నౌకాయానం అంత సులభం కాదు. ఈ జలసంధి ఇరాన్, ఒమన్‌ల నియంత్రణలో ఉంది. ఇరాన్ అనుమతి లేకుండా ఏ నౌక అయినా ఇక్కడ నుండి వెళ్లడం కష్టం. ప్రస్తుత యుద్ధ సంక్షోభంలో, ఇక్కడి నుండి బయలుదేరలేక చిక్కుకుపోయిన నౌకల సంఖ్య వెయ్యికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు.