Iran Israel War : ప్రపంచం మొత్తం పెట్రోల్ మంటల్లో తగలబడాల్సిందేనా? యూఏఈ గ్యాస్ ప్లాంట్ల మీద బాంబులేసిన ఇరాన్

Iran Israel War : మిడిల్ ఈస్ట్‎లో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు.. ఇరాన్ మరోవైపు తలపడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. తాజాగా ఇరాన్ తన పొరుగు దేశాలైన యూఏఈ, ఖతార్‌లలోని గ్యాస్ ప్లాంట్లపై దాడులు చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి.

Update: 2026-03-19 04:01 GMT

Iran Israel War 

Iran Israel War : మధ్య ప్రాచ్యంలో యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇజ్రాయెల్ తన ఎనర్జీ సెక్టార్‌పై దాడులు చేయడంతో రగిలిపోయిన ఇరాన్, పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది. గురువారం ఉదయం యూఏఈలోని అబుదాబీలో ఉన్న హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఫీల్డ్ పై ఇరాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల వల్ల అక్కడ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. దీనిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. అంతకుముందు ఖతార్‌లోని గ్యాస్ ప్లాంట్లపై కూడా ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. తమ దేశ ఆర్ధిక మూలమైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడమే దీనికి కారణమని ఇరాన్ వాదిస్తోంది.

ఇరాన్ కీలక నేతల హతం

ఇజ్రాయెల్ తన వేటను ఆపడం లేదు. బుధవారం రాత్రి జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అంతేకాకుండా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ సలహాదారు అయిన అలీ లారిజానీని కూడా ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ పరిణామంతో ఇరాన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా పెద్ద సర్ ప్రైజ్‌లు రాబోతున్నాయి అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించడం యుద్ధ తీవ్రతను చాటిచెబుతోంది.

ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు

యుద్ధం వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 5 శాతం పెరిగి 108 డాలర్లకు చేరాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు ధరలు ఏకంగా 50 శాతం పెరగడం గమనార్హం. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన 'హోర్ముజ్ జలసంధి'ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. అమెరికా మరియు దాని మిత్రదేశాల నౌకలను ఈ మార్గం గుండా వెళ్లనివ్వబోమని ఇరాన్ తెగేసి చెబుతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నిరాశ్రయిలైన లక్షలాది మంది

ఈ యుద్ధం వల్ల అమాయక ప్రజలు బలిపీఠం ఎక్కుతున్నారు. లేబనాన్ ప్రభుత్వం సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల వల్ల దాదాపు 10 లక్షల మంది లేబనీయులు నిరాశ్రయులయ్యారు. అంటే ఆ దేశ జనాభాలో 20 శాతం మంది వీధిన పడ్డారు. ఇప్పటి వరకు ఇరాన్‌లో 1,300 మందికి పైగా, లేబనాన్‌లో 968 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఇజ్రాయెల్‌లో కూడా ఇరాన్ మిసైళ్ల దాడిలో 14 మంది మరణించారు. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.

Tags:    

Similar News