PM Modi: UAE అధ్యక్షునికి ఫోన్ లో ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు
PM Modi: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఆయనకు ఈద్ శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
PM Modi
PM Modi: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. షేక్ జాయెద్‌కు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, తరువాత పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు పశ్చిమ ఆసియాలోని పరిస్థితి,హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల సురక్షిత ప్రయాణం గురించి చర్చించారు. అంతేకాకుండా, యూఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి ఖండించారు.
యూఏఈ అధ్యక్షునితో మాట్లాడిన తరువాత ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన X హ్యాండిల్ లో షేర్ చేశారు. ఆయన తన ట్వీట్ లో.. “నేను యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఈద్ పండుగ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలను ముందుగానే తెలియజేశాను. తరువాత మేము పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించాము. ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొని, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించిన యూఏఈపై ఇటీవల జరిగిన దాడులను కూడా ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండించాము” అని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో, హోర్ముజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు సురక్షితంగా, నిరాటంకంగా ఉండాలని కూడా తామిరువురమూ గట్టిగా భావిమ్చిఅంట్టు ప్రధాని మోదీ తెలిపారు. మధ్యప్రాచ్యంలో వీలైనంత త్వరగా శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇది రెండోసారి..
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడటం ఇది రెండోసారి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాన్‌తో సహా పశ్చిమ ఆసియాకు చెందిన పలువురు నాయకులతో మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం నేటికీ కొనసాగుతోంది.
రోజు రోజుకూ దిగజారుతున్న పరిస్థితులు..
అమెరికా, ఇజ్రాయేల్ దాడులకు ప్రతిగా ఇరాన్ అరబ్ దేశాలపై దాడులకు దిగింది. కువైట్ లాంటి దేశాలు ఈ దాడుల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇదికాకుండా హర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసింది ఇరాన్. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ప్రభావితమైంది. ఈ యుద్ధం ప్రభావంతో చాలా దేశాలు చమురు, గ్యాస్ కొరతతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. యుద్ధంలో మాజీ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ, భద్రతా అధిపతి అలీ లారిజానీ సహా పలువురు ప్రముఖ ఇరాన్ నాయకులు హతమయ్యారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో లెబనాన్‌లో పరిస్థితి మరింత దిగజారుతోంది. దేశంలో సురక్షితమైన ప్రదేశం ఏదీ మిగల్లేదని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడే మొదలైందని, ఇది క్రమంగా ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.