Liquor Sales: పెద్దన్నకు పెద్ద తలనొప్పే..USలో మందుబాబులు తగ్గిపోతున్నారట..

Liquor Sales: అమెరికాలో మందు తాగేవారు తగ్గిపోతున్నారట. ఆ ప్రభావం అక్కడి రెస్టారెంట్ల మీద.. దాని తరువాత ప్రభుత్వం మీదడి గట్టిగానే పద్దుతోందని చెబుతున్నారు.

Update: 2026-03-18 11:16 GMT

Liquor Sales

Liquor Sales: అదేంటీ.. మందు బాబులు తగ్గిపోతే మంచిదే కదా.. తలనొప్పి అంటారేమిటి అనుకుంటున్నారా? మందు తాగడం జనాలు మానేస్తే ప్రభుత్వాలకు తలనొప్పే కదండీ.. అది మన దేశం అయినా అమెరికా అయినా సరే.. నిజమైన టాక్స్ పేయర్స్ మందు బాబులే కదా. మందు తాగేవాళ్ళు తగ్గిపోతే ఆటోమెటిగ్గా ప్రభుత్వాల ఆదాయాలు పడిపోతాయి. ఒక్క టాక్స్ రూపంలోనే కాదు.. మందు తాగాలంటే బార్ కి వెళతారా? మరి బార్ లో ఫుడ్ తింటారా? మరి మందు తాగేవాళ్ళు తగ్గిపోతే బార్లు, రెసారెంట్లు ఎలా నడుస్తాయి? అవి నడవకపోతే మరింత ఆదాయం ప్రభుత్వాలకు పోయినట్టే కదా. సరే.. అసలు విషయం ఏమిటంటే..

అమెరికాలో మద్యం వినియోగం తగ్గుతోందని చెబుతున్నారు. దీని ప్రభావం రెస్టారెంట్ వ్యాపారంపై ఎక్కువగా పడుతోంది. 2025 గాలప్ పోల్ వివరాల ప్రకారం, అమెరికాలో మద్యం సేవించే వారి వాటా తక్కువ స్థాయిలో ఉంది. కేవలం 54% మంది మాత్రమే తాము మద్యం సేవిస్తామని చెప్పారు. మందు తాగుతున్నాం అని చెప్పిన వారు కూడా గతంలో కంటే తక్కువగా తాగుతున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడుతుండడం.. పెరుగుతున్న మద్యం ధరలు దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

2025 నాటికి మద్యం అమ్మకాలు తీవ్రంగా పడిపోతాయని అమెరికాలోని 31% మంది నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. న్యూజెర్సీలోని ఒక రెస్టారెంట్ యజమాని తన ఆదాయంలో గతంలో 40% ఆహారం, 60% మద్యం ఉండేదని వివరించారు. ఇప్పుడు, ఆదాయంలో 70% ఆహారం నుండి, కేవలం 30% మాత్రమే మద్యం నుండి వస్తోందని సర్వేలో చెప్పారట.

మధ్యవయసు వారు తక్కువగా.. జెన్-జెడ్ దూరంగా..

అమెరికాలో ఒకప్పుడు తెగ తాగిపడేసే వారిగా ఉన్న మిలీనియల్స్ అంటే మధ్య వయసు (31-45) వారు ఇప్పుడు తక్కువగా తాగుతున్నారట. అలాగే జెన్-జెడ్ యువత ఆ గ్యాప్ ఫిల్ చేయడం లేదని చెబుతున్నారు. అంటే వారు అసలు మందు జోలికే పోవడం లేదట. రెస్టారెంట్లలో ఒక డ్రింక్ తాగి.. ఓ సెల్ఫీ దిగి వెళ్ళిపోతున్నారట. దీంతో మద్యం ఆదాయం రెస్టారెంట్లకు బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు. అలా అని యువత అసలు మత్తు జోలికే పోవడం లేదని అనుకోవడానికి లేదు. ద్రవ్యోల్బణంతో గంజాయి లాంటి చౌక మత్తుకు అలవాటు పడి.. ఖరీదైన మద్యం జోలికి పోవడం లేదట అంతే.

భారీగా పెరిగిన ధరలు.. నిరుద్యోగం

గతంలో $8, అంటే సుమారు ₹730 ఉండే విస్కీ, బీర్ ధర ఇప్పుడు $20, అంటే ₹1,800 అయింది. టెక్నోమిక్ నివేదిక ప్రకారం, 9.2% నిరుద్యోగ రేటు కూడా జెన్ Z తరం వారి జేబులపై భారం మోపుతోంది. దీంతో వీరు మద్యం జోలికి పోవడానికి వెనకేడుగు వేస్తున్నారని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.

కారణాలు ఏమైనా.. మద్యం జోలికి పోకుండా ప్రజలు ఉంటే క్రైమ్ రేటు తగ్గుతుందేమో కదా. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. క్రైమ్ రేటు తగ్గితే కూడా అదీ మనమంచికే అని అమెరికా ప్రభుత్వం అనుకోవడం బెటర్. అన్నట్టు.. మన దగ్గర కూడా మద్యం ధరలు పెరిగితే జనం దానికి దూరమైపోతారని కదా ప్రభుత్వం చెబుతూ ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచేస్తుంటుంది. కానీ, ఇక్కడ ఎందుకబ్బా.. మందుబాబులు కేసులకు కేసులు ఖాళీ చేసేస్తున్నారు? డబ్బంటే లెక్క లేకనా? బలహీనతను జయించలేకనా? ఏమో మరి అది పైవాడికే తెలియాలి!

Tags:    

Similar News