Oil Crisis: భారత్ కు ఆయిల్ సరఫరా.. కొత్త మార్గం తెరిచినా సౌదీ
Oil Crisis: భారత్ కు ఆయిల్ పంపించడం కోసం సౌదీ అరేబియా ఎర్రసముద్రం మార్గాన్ని ఎంచుకుంది. ఈ మార్గం నుంచి ఇప్పటికే రెండు షిప్స్ బయలు దేరినట్లు చెబుతున్నారు.
Oil Crisis
Oil Crisis: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు క్రూడాయిల్ సరఫరాలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోంది. హోర్ముజ్ జలసంధి నుంచి ఓడల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ముడి చమురు కోసం ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. సౌదీ అరేబియా నుంచి క్రూడాయిలు తీసుకోవడం ఆ ప్రత్యామ్నాయాల్లో ఒకటి. అయితే, దీనికి కూడా హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు అడ్డు పడుతున్నాయి. దీంతో సౌదీ అరేబియా వేరే మార్గం నుంచి ముడి చమురును భారత్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మన దేశానికి ముడి చమురు సరఫరా చేసేందుకు సౌదీ అరేబియా ఎర్ర సముద్రంలో ఒక కొత్త మార్గాన్ని తెరిచింది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ చర్య తీసుకున్నారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం జరిగే హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పుల నేపథ్యంలో సౌదీ అరేబియా ఈ కొత్త మార్గం ద్వారా భారతదేశానికి చమురు సరఫరాను ప్రారంభించింది.
దీని ప్రకారం, భారత్ కు రావాల్సిన చమురు ట్యాంకర్లు సౌదీ అరేబియాలోని యాన్బు ఓడరేవు నుండి బయలుదేరుతున్నాయి. 6 మిలియన్ బ్యారెళ్ల చమురును తీసుకువెళ్తున్న నాలుగు ట్యాంకర్లు ఇప్పటికే భారతదేశానికి బయలుదేరాయని సమాచారం. ఈ నెలాఖరు నాటికి మరో 1 మిలియన్ బ్యారెళ్లను భారతదేశానికి తీసుకురావడమే దీని లక్ష్యం అని చెబుతున్నారు.
క్లిష్టమైన మార్గం..
నిజానికి సౌదీ అరేబియా నుంచి హర్ముజ్ జల సంధి ద్వారా రావడమే సులువైన మార్గం. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం సౌదీ ఎంచుకుంది. ఈ మార్గంలో ఆయిల్ సరఫరాకు చిక్కులు ఉన్నాయి. పైప్ లైన్ ద్వారా ముడి చమురును 1200 కిలోమీటర్ల దూరంలోని యాన్బు ఓడరేవుకు పంపించాలి. అక్కడ నుంచి ఓడల ద్వారా భారత్ కు పంపాలి. కానీ, ఈ సముద్ర మార్గంలో చాలా కఠిన పరిస్థితులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఎర్ర సముద్రంలోని బాబ్ అల్-మండబ్ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారుల నుండి వచ్చే ముప్పు. ఇపుడు బయలుదేరిన ఈ రెండు ఓడలు ఈ అడ్డంకులు ఎదుర్కొని భారత్ చేరుకోవాల్సి ఉంటుంది.
గల్ఫ్ లో యుద్ధం తీవ్రతరం..
ఇరాన్ ఖతార్‌లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై దాడి చేసింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా తయారయ్యాయి. ఈ దాడులపై 12 ముస్లిం దేశాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దాడులను తక్షణమే నిలిపివేయాలని వారు ఇరాన్‌ను కోరారు. సౌదీ అరేబియా కూడా ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మాట్లాడుతూ, "ఇరాన్‌కు ప్రతిస్పందించే పూర్తి సామర్థ్యం మా దేశానికి ఉంది. ఇరాన్ దాడులు ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తున్నాయి, ఇవి మా సహనాన్ని పరీక్షించకూడదు" అని అన్నారు.
ఈ ఉద్రిక్తతల మధ్యలో మరిన్ని రోజులు యుద్ధ వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆచి, తూచి స్పందిస్తోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ నిల్వల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది.