Iran–US War: తగ్గేదేలే అంటోన్న ఇరాన్.. ఇకపై టార్గెట్ అవేనంటూ ప్రకటన. రంగంలోకి అమెరికన్ ఆర్మీ
Iran–US War: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలపై కూడా ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అమెరికా వెంటనే అలర్ట్ అయ్యింది.
Iran–US War: తగ్గేదేలే అంటోన్న ఇరాన్.. ఇకపై టార్గెట్ అవేనంటూ ప్రకటన. రంగంలోకి అమెరికన్ ఆర్మీ
Iran–US War: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలపై కూడా ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అమెరికా వెంటనే అలర్ట్ అయ్యింది.
ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారి జనరల్ అబోల్ఫజల్ షెకార్చీ ప్రకారం, తమ శత్రువులపై దాడులు కేవలం మధ్యప్రాచ్యంతో పరిమితం కావని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు కూడా లక్ష్యాలుగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ ఈ విధమైన హెచ్చరిక ఇవ్వడం వల్ల ప్రపంచ దేశాలు అప్రమత్తంగా మారాయి.
అమెరికా భారీ సైనిక బలగాల పంపిణీ
ఈ పరిస్థితుల్లో అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక శక్తిని పెంచుతోంది. అమెరికా మూడు కొత్త అంఫిబియస్ యుద్ధ నౌకలతో పాటు సుమారు 2,500 మెరైన్ సైనికులను ప్రాంతానికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే మరో 2,500 మెరైన్స్‌తో కూడిన నౌకాదళాన్ని పసిఫిక్ ప్రాంతం నుంచి మళ్లించారు. దీంతో మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనికుల సంఖ్య 50 వేలకుపైగా చేరింది.
యుద్ధాన్ని తగ్గించే సూచనలు చేసిన ట్రంప్
ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. “మధ్యప్రాచ్యంలో మా సైనిక చర్యలు లక్ష్యాలకు దగ్గరగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వాటిని తగ్గించే దిశగా ఆలోచిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వం యుద్ధానికి నిధుల కోసం కాంగ్రెస్ నుంచి మరో 200 బిలియన్ డాలర్లు కోరడం గమనార్హం. దీంతో అమెరికా విధానం పై సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఈ యుద్ధం ప్రపంచ చమురు సరఫరాపై పెద్ద ప్రభావం చూపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ప్రపంచ చమురులో దాదాపు ఐదవ వంతు ఈ మార్గం గుండా వెళ్తుంది. యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు పెరిగింది. యుద్ధం ప్రారంభానికి ముందు ఇది సుమారు 70 డాలర్ల వద్ద ఉండేది.
ఈ యుద్ధం కారణంగా భారీ ప్రాణనష్టం కూడా జరుగుతోంది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు సమాచారం. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌లో ఇరాన్ మిస్సైల్ దాడుల్లో 15 మంది మరణించారు. ఇదిలా ఉండగా దుబాయ్, జెరూసలేం వంటి నగరాల్లో కూడా భారీ పేలుళ్లు వినిపించాయి. రంజాన్ ముగింపు సందర్భంగా ఈద్ పండుగ జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.