Train Accident: ఏనుగుల మందను ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన 5 బోగీలు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. సైరాంగ్ నుంచి దిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ హొజాయ్ జిల్లాలో పట్టాలపై ఉన్న ఏనుగుల మందను ఢీకొట్టింది.
Train Accident: ఏనుగుల మందను ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన 5 బోగీలు
గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. సైరాంగ్ నుంచి దిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ హొజాయ్ జిల్లాలో పట్టాలపై ఉన్న ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఏనుగులు మృతిచెందగా, రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.
నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగంగా ఏనుగుల మందను ఢీకొనడంతో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏనుగు తీవ్రంగా గాయపడింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఘటన జరిగిన వెంటనే రైల్వే, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.
ఈ ప్రాంతం అధికారికంగా ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలపై ఏనుగుల మందను గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోయామని చెప్పారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.