తాగునీటి సమస్యపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

వివిధ కంపెనీల వాటర్ బాటిళ్ల నాణ్యతపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్యాకేజ్డ్ తాగునీటి సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో విఫలమైనట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.

Update: 2025-12-19 09:55 GMT

న్యూఢిల్లీ: వివిధ కంపెనీల వాటర్ బాటిళ్ల నాణ్యతపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్యాకేజ్డ్ తాగునీటి సరఫరాలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో విఫలమైనట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ తాగునీటిని పొందలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల నాణ్యతను ఎత్తి చూపుతూ దాఖలైన పిటిషన్ ని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం

‘లగ్జరీ పిటిషన్’ గా పేర్కొంది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సమస్యలను ముందుగా పరిష్కరించాలని, ఆ తర్వాత బాటిళ్ల నాణ్యతపై ఆలోచించమని సుప్రీంకోర్టు సూచించింది. దేశంలో పలు ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమికమైన తాగునీరు కూడా అందుబాటులో లేనందున, ప్యాకేజ్డ్ వాటర్ నాణ్యత పరిరక్షణ అంశం తక్షణ ప్రాధాన్యతలో ఉండకపోవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి పల్లె ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, ఎడారి ప్రాంతాల ప్రజలు ఇంకా శుద్ధి చేయని నీటితోనే బాధపడుతున్నారు. అక్కడ సాధారణ ప్రజల నిత్యజీవనానికి తగిన తాగునీరు లభించటం కూడా పెద్ద సమస్యగా ఉంది.

సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై స్పష్టమైన అంగీకారం ఇవ్వకపోడంతో, తాగునీటి ప్రాధాన్యతను, ప్రజల జీవనాధారాన్ని ముందుగా కాపాడే దిశగా ప్రభుత్వానికి సంకేతం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కీలక మార్గదర్శకంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News