ఏపీలో జాతీయ రహదారుల దిగ్బంధం

Update: 2018-03-22 06:33 GMT

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టింది. ఈ ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఆందోళన నిర్వహించారు. టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు నిరసనలో పాల్గొన్నాయి.

ప్రత్యేకహోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. గుంటూరులోని చిలకలూరి పేట జాతీయ రహదారి జనసేన, వైసీపీ, సీపీఎం, సీపీఐ శ్రేణులు దిగ్బంధించాయి. జాతీయ రహదారుల దిగ్బంధనంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. హోదా ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. జాతీయ రహదారులపై వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిరసన తెలిపారు. అటు అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపైనా ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలో అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్రం ఇప్పటికైనా విభజన హామీలు నెరవేర్చకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని నేతలు హెచ్చరించారు. శ్రీకాకుళం  జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న 16వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధం చేసినట్లు వారు తెలిపారు. 

ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి వ్యతిరరేకంగా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటిదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 

ఏపి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తెదేపా శ్రేణులు విజయవాడలో ఆందోళన నిర్వహించాయి. చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై రామవరప్పాడు కూడలి వద్ద తెదేపా యువనాయకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 

Similar News