షా, జగన్ భేటీలో ఏం తేలింది?

Update: 2019-10-22 13:20 GMT

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన జగన్‌కు సుదీర్ఘ ఎదురుచూపులు తర్వాత అమిత్‌షా అపాయింట్ మెంట్‌ ఇవ్వడం అదే సమయంలో మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలవకుండానే వెనుదిరగడంపై టీడీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే, బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకపోయినా అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని, రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై చర్చించారంటూ వైసీపీ కౌంటరిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ టూర్‌లో 45 నిమిషాలపాటు అమిత్‌షాతో సమావేశమైన వైఎస్ జగన్‌ విభజన సమస్యలతోపాటు రెవెన్యూ లోటు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, గోదావరి-కృష్ణానదుల అనుసంధానంపై చర్చించారు. అదేవిధంగా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం, రామాయపట్నంలో పోర్టు నిర్మాణం, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. ఇక, బుందేల్‌ఖండ్ తరహాలో వెనకబడ్డ జిల్లాలకు ఏటా 4వేల కోట్లు ఇవ్వాలన్న జగన్‌ ప్రస్తుతం ఏపీకివ్వాల్సిన 1050కోట్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, 55వేల 548కోట్లకు సవరించిన పోలవరం అంచనాలను ఆమోదించాలని అమిత్‌షాకు జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందులో 33వేలకోట్లు భూసేకరణకు, ఆర్ అండ్ ఆర్‌కు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇక, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన 5వేల 73కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం 16వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఈ నిధులన్నీ వీలైనంత త్వరగా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం జగన్మోహన్‌రెడ్డి మెమొరాండం ఇచ్చారు.

ఇదిలా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన జగన్‌కు సుదీర్ఘ ఎదురుచూపులు తర్వాత అమిత్‌షా అపాయింట్ మెంట్‌ ఇవ్వడం అదే సమయంలో మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలవకుండానే వెనుదిరగడంపై టీడీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే, తెలుగుదేశం ఆరోపణలకు కౌంటరిచ్చిన వైసీపీ అమిత్‌షాతో 45 నిమిషాల పాటు సమావేశమైన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై చర్చించారని తెలిపింది. బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకపోయినా అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇక, ఏపీ సమస్యలపై ఇతర మంత్రులతో తాను మాట్లాడతానని అమిత్‌షా మాటివ్వడంతోనే రవిశంకర్ ప్రసాద్‌, ప్రహ్లాద్ జోషితో భేటీ కాకుండానే సీఎం జగన్‌ ఢిల్లీ నుంచి వెనుదిరిగారని వివరణ ఇచ్చింది.

Tags:    

Similar News