Tirumala Laddu: తిరుమల లడ్డూల విక్రయాలలో రికార్డు.. నెలకు కోటి దాటిన అమ్మకాలు, టీటీడీకి పెరిగిన ఆదాయం!
Tirumala Laddu: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
Tirumala Laddu: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత కొద్ది నెలలుగా రోజుకు 4 లక్షలకు పైగా లడ్డూలను టీటీడీ విక్రయిస్తోంది. కేవలం ఆగస్టు నెలలోనే కోటి 24 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. గత 11 సంవత్సరాల్లో 25 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 111 కోట్ల లడ్డూలను టీటీడీ విక్రయించింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు లడ్డూ ప్రసాదం ఒక ముఖ్యమైన భాగం. తిరుమల యాత్ర ముగిసిన అనంతరం బంధుమిత్రులకు పంచడానికి భక్తులు అదనంగా లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు. ఈ లడ్డూలకు ఉన్న ప్రత్యేకమైన రుచి, నాణ్యతతో డిమాండ్ భారీగా పెరిగింది. లడ్డూల ఉత్పత్తి సామర్థ్యాన్ని టీటీడీ పెంచుతున్న కొద్దీ.. విక్రయాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
గతంలో శ్రీవారి ఆలయంలోని పోటులో మాత్రమే లడ్డూలను తయారు చేసేవారు. స్థలం తక్కువగా ఉండటంతో రోజుకు లక్ష నుంచి లక్షా 20 వేల లడ్డూలు మాత్రమే తయారు చేయగలిగేవారు. దీంతో భక్తులకు అదనపు లడ్డూలు దొరకడం కష్టంగా ఉండేది. లడ్డూల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆలయం వెలుపల టీటీడీ బూంది పోటును ప్రారంభించింది. దీంతో ఉత్పత్తి రోజుకు మూడు లక్షల వరకు పెరిగింది. 2015లో అదనపు బూంది పోటును ఏర్పాటు చేయడంతో లడ్డూల ఉత్పత్తి నాలుగు లక్షలకు చేరింది. శ్రీవారి సర్వదర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చి, అదనపు లడ్డూలను తక్కువ ధరలకు విక్రయించేవారు. అయితే, ఒక్కో లడ్డూ తయారీకి రూ. 38 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుండటంతో టీటీడీకి ఆర్థిక భారం పెరిగింది. దీంతో సబ్సిడీ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇచ్చి, అదనపు లడ్డూలను ఒక్కొక్కటి 50 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా లడ్డూల విక్రయాలు టీటీడీకి లాభసాటిగా మారాయి.
2014లో ఏడాదికి 9 కోట్ల 5 లక్షల లడ్డూలు విక్రయించగా, 2023లో ఆ సంఖ్య 12 కోట్ల 49 లక్షలకు చేరుకుంది. సాధారణంగా నెలకు కోటి లడ్డూలు అమ్ముడవుతుండగా, గత రెండు మూడు నెలలుగా ఈ సంఖ్య కోటి 20 లక్షలు దాటేసింది. నాణ్యమైన నెయ్యి, ఇతర పదార్థాల వాడకం వల్ల ఇటీవల లడ్డూలకు మంచి పేరు తీసుకొచ్చింది. 2023లో లడ్డూల విక్రయాల ద్వారా 43 కోట్ల ఆదాయం రాగా, 2024లో రూ. 42 కోట్లు, 2025లో 48 కోట్ల అమ్మకాలు జరిగాయి. అలాగే లడ్డూ ఉత్పత్తిని కూడా దాదాపు 20 లక్షల వరకు పెంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. లడ్డూ విక్రయాలు పెరగడంతో టీటీడీకి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.