Social Media Ban : 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సంచలన నిర్ణయం
Social Media Ban : ఆంధ్రప్రదేశ్ (13 ఏళ్ల లోపు), కర్ణాటక (16 ఏళ్ల లోపు) రాష్ట్రాలు పిల్లల కోసం సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాయి. డిజిటల్ వ్యసనం నుంచి పిల్లలను రక్షించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
Social Media Ban for Kids
Social Media Ban : ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా ఒక వ్యసనంగా మారుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, కౌమార దశలో ఉన్నవారు దీనికి బానిసలై తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలోని రెండు కీలక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ తరహా ఆంక్షలు విధిస్తున్న మొదటి భారతీయ రాష్ట్రాలుగా ఇవి చరిత్రకెక్కాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్ల లోపు వారికి నో ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే 90 రోజుల్లోగా ఈ నిబంధనలు పక్కాగా అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, 13 నుంచి 16 ఏళ్ల వయస్సు గల వారికి కూడా ఈ నిషేధాన్ని వర్తింపజేయాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని నాయుడు పేర్కొన్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లల చదువు, ప్రవర్తన దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో మరింత కఠినం
పక్క రాష్ట్రం కర్ణాటక ఒక అడుగు ముందుకేసి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-27 రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పిల్లలు మొబైల్ ఫోన్లు దగ్గర ఉంచుకోవచ్చు కానీ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను మాత్రం వాడకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ఇళ్లలో దీనిని ఎలా నియంత్రించాలనే దానిపై త్వరలోనే ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని ఆయన తెలిపారు.
నిపుణుల హర్షం
భారతదేశం కంటే ముందే ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాలు ఈ దిశగా అడుగులు వేశాయి. ఆస్ట్రేలియా 2025లోనే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ఈ నిర్ణయంపై వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో డిప్రెషన్, నిద్రలేమి, అవాంఛిత పోలికల వల్ల కలిగే ఆందోళన తగ్గుతాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ చట్టాన్ని అమలు చేయడం అంత సులభం కాదని కొందరు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. నేటి విద్యా విధానం అంతా యాప్‌ల మీద ఆధారపడి ఉన్న తరుణంలో సోషల్ మీడియాను మాత్రమే వేరు చేయడం సవాలుతో కూడుకున్న పని అని వారు అంటున్నారు.