Chicken Price Hike : ఇక ముక్క తినాలంటే 30 సార్లు ఆలోచించాల్సిందే.. రూ.300 దాటేసిన కిలో చికెన్ ధర
Chicken Price Hike : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.310కి చేరగా, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణం. మరోవైపు ఎగుమతులు నిలిచిపోవడంతో గుడ్ల ధరలు భారీగా తగ్గాయి.
Chicken Price Hike
Chicken Price Hike : నాన్ వెజ్ ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు.. కంచంలో చికెన్ ముక్క పడాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ముక్క సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో పాతాళానికి పడిపోయిన ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 మార్కును దాటేయడంతో సామాన్యులు చికెన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ముక్క లేనిదే ముద్ద దిగని వారంతా ఇప్పుడు ధరలు చూసి నీళ్లు నములుతున్నారు.
ఎందుకింతలా పెరిగాయి..?
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఉత్పత్తి తగ్గడమేనని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా బర్డ్ ఫ్లూ ప్రభావం ఉండటంతో చాలా మంది రైతులు కొత్తగా కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు. దీంతో మార్కెట్‌లో కోళ్ల కొరత ఏర్పడింది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం పోవడంతో జనం మళ్లీ చికెన్ తినడం మొదలుపెట్టారు. డిమాండ్ పెరగడం, అందుకు తగ్గట్టుగా కోళ్ల సప్లై లేకపోవడంతో ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఏపీకి గతంలో ఒడిశా నుంచి కోళ్లు వచ్చేవి, కానీ అక్కడ కూడా ధరలు పెరగడంతో ఇప్పుడు రాజమండ్రి వంటి ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి రవాణా ఖర్చులు తోడై రేట్లు మరింత భారంగా మారాయి.
చికెన్ వర్సెస్ ఎగ్.. పరిస్థితి ఏంటి?
ప్రస్తుత ధరల పరిస్థితిని చూస్తే లైవ్ బ్రాయిలర్ కోడి కిలో రూ.167 మార్కుకు చేరింది. ఇక డ్రస్డ్ చికెన్ కావాలంటే రూ.280 నుంచి రూ.290 చెల్లించాల్సి వస్తోంది. అందరూ ఇష్టపడే స్కిన్ లెస్ చికెన్ అయితే ఏకంగా రూ.310 వరకు పలుకుతోంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. చికెన్ ధరలు పెరుగుతుంటే, కోడిగుడ్ల ధరలు మాత్రం దారుణంగా పడిపోయాయి. పశ్చిమాసియాలో సాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్‌కు రావడంతో గుడ్డు ధర రూ.3.50కే లభిస్తోంది. పౌల్ట్రీ రంగానికి చికెన్ రూపంలో లాభం వస్తుందనుకుంటే, గుడ్ల రూపంలో రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది.