Free Bus : దివ్యాంగులకు చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీకి ముహూర్తం ఫిక్స్
ఏపీలో మార్చి 18 నుంచి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. ఇంద్రధనస్సు పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ 40% వైకల్యం ఉన్నవారు ఫ్రీగా ప్రయాణించవచ్చు.
AP Free Bus
Free Bus : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయంతో ప్రజల ముందుకు వచ్చింది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు అదే బాటలో దివ్యాంగులకు కూడా అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇంద్రధనస్సు అనే ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.
ఒక్క రూపాయి లేకుండానే..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగులకు మేలు చేకూర్చే ఈ పథకాన్ని మార్చి 18, 2026న సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి దివ్యాంగులు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు దివ్యాంగులకు బస్సు టికెట్లపై కేవలం 50 శాతం మాత్రమే రాయితీ ఉండేది. కానీ కొత్త పథకం అమలుతో అది కాస్తా పూర్తి ఉచితంగా మారిపోయింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఎవరైనా ఈ పథకానికి అర్హులని ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది.
వాళ్లకు కూడా 50శాతం రాయితీ
ఏయే బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందనే దానిపై కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు వంటి గ్రామీణ సర్వీసులతో పాటు, నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా వెళ్లవచ్చు. అంతేకాదు, తీవ్ర వైకల్యం ఉండి ఒంటరిగా ప్రయాణించలేని దివ్యాంగుల వెంట వచ్చే సహాయకుడికి కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. ఇది దివ్యాంగుల కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం.
తెలంగాణలో లేదు
ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఇలాంటి పథకం వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మార్చి 20న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దివ్యాంగులకు ఫ్రీ బస్సు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై టీఎస్‌ఆర్టీసీ స్పందిస్తూ అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. తెలంగాణలో ప్రస్తుతం మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ఉందని, దివ్యాంగులకు పాత పద్ధతిలోనే 50 శాతం రాయితీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని అక్కడి అధికారులు ప్రజలను కోరారు.