Women Schemes : వారి ఖాతాల్లోకి 48 గంటల్లోనే నగదు.. చంద్రబాబు సర్కార్ వరాల జల్లు
Women Schemes : ఏపీలో మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. పావలా వడ్డీకే లక్ష వరకు రుణం, యానిమేటర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లను చంద్రబాబు ప్రకటించారు.
Chandrababu Naidu Women Schemes
Women Schemes : అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మహిళలకు బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. మహిళా సాధికారతే ధ్యేయంగా మూడు విప్లవాత్మక పథకాలను ప్రారంభించారు. ఆడబిడ్డల చదువుకు ఆసరాగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, పెళ్లిళ్లకు భరోసాగా ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి, డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు ఉచిత స్మార్ట్‌ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మహిళల ఆర్థిక ఇబ్బందులను తొలగించి, వారిని స్వశక్తితో ఎదిగేలా చేయడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి
పేదింటి ఆడపిల్లలు పైచదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని చంద్రబాబు సర్కార్ అమల్లోకి తెచ్చింది. డ్వాక్రా సంఘాల్లో కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల వరకు ఉన్నత విద్య కోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనికి కేవలం పావలా వడ్డీ (25 పైసలు) మాత్రమే వసూలు చేస్తారు. ఈ అప్పును తీర్చడానికి 48 నెలల (4 ఏళ్ల) సుదీర్ఘ గడువును ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల్లోనే స్త్రీనిధి బ్యాంకు ఖాతాలోకి నగదు చేరుతుంది.
ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి
ఆడపిల్లల పెళ్లి చేయాలంటే తలిదండ్రులు అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చింది. డ్వాక్రా మహిళల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం. అవసరాన్ని బట్టి రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు రుణం పొందే వెసులుబాటు ఉంది. దీనికి కూడా కేవలం రూ.25 పైసల వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి మోసపోకుండా, డ్వాక్రా సంఘాల ద్వారానే ఈ సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
యానిమేటర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.. ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు
డ్వాక్రా సంఘాల పనితీరును డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రికార్డుల నిర్వహణ, బుక్ కీపింగ్ పనులను సులభతరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,500 మంది యానిమేటర్లకు రూ.15,000 విలువైన స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు కూడా స్మార్ట్‌ఫోన్లు అందుతాయి. అలాగే, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసే 600 మంది ఏపీఎంలకు అత్యాధునిక ల్యాప్‌టాప్‌లను ప్రభుత్వం అందజేస్తోంది. దీనివల్ల డ్వాక్రా లావాదేవీలన్నీ మరింత పారదర్శకంగా మారుతాయి.
అర్హతలు, దరఖాస్తు విధానం
ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రంతో పాటు విద్యార్థినుల విషయంలో కాలేజీ అడ్మిషన్ లెటర్, ఫీజు రిసిప్ట్‌లను సిద్ధం చేసుకోవాలి. మీ పరిధిలోని డ్వాక్రా సంఘం ప్రతినిధిని లేదా సెర్ప్ యానిమేటర్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. వెలుగు కార్యాలయాల ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన రెండు రోజుల్లోనే నగదు మంజూరవుతుంది.