CM Chandrababu: వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు.. అసెంబ్లీలో చంద్రబాబు నిప్పులు..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు.
CM Chandrababu: వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు.. అసెంబ్లీలో చంద్రబాబు నిప్పులు..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కూటమి ప్రభుత్వ లక్ష్యాలు మరియు గత ప్రభుత్వ వైఫల్యాలను ఆయన సోదాహరణంగా వివరించారు. కూటమిలోని మూడు పార్టీలు (TDP, JSP, BJP) పూర్తి సమన్వయంతో, విభేదాలకు తావులేకుండా ముందుకు సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఏడాదే పోలవరం పూర్తి
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సీఎం కీలక ప్రకటన చేశారు. "ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం" అని ప్రకటించారు. అలాగే, అమరావతిని ప్రపంచం మెచ్చేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ అప్పుల భారంపై ధ్వజం
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని విమర్శించారు. ఇష్టానుసారం చేసిన అప్పులను కేంద్రం సహకారంతో రీషెడ్యూల్ చేయించి రాష్ట్రాన్ని కాపాడుతున్నామని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష హోదాపై ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా కోసం చేస్తున్న డిమాండ్లపై చంద్రబాబు ఎద్దేవా చేశారు. "ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. వైసీపీకి ఆ హోదాకు సరిపడా సీట్లు కూడా ప్రజలు ఇవ్వలేదంటే వారిపై ఉన్న వ్యతిరేకత అర్థం చేసుకోవచ్చు. 11 మంది ఉన్నా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు" అని మండిపడ్డారు.
కూటమి విజయంపై హర్షం
కూటమి తరపున నిలబడ్డ అభ్యర్థుల్లో 94 శాతం మందిని ప్రజలు గెలిపించడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా గెలిచిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.