రాజధాని గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత

Update: 2020-01-10 05:19 GMT

అమరావతి రాజధాని గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మహిళలు చేపట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో దొండపాడులో రోడ్లపై పోలీసులు ఫెన్సింగ్‌ వేశారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రైతలమని గ్రామంలో నేరస్థులు ఎవరూ లేరని మండిపడ్డారు. మరోపక్క గుంటూరు జిల్లా తాడికొండలోని లాం వద్ద కాలేజ్‌ విద్యార్థులు నిరసనకు దిగారు. రాజధానిని తరలించవద్దంటూ నినాదాలు చేస్తున్నారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు రైతు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమల్లో ఉన్నందున ఎవరూ బయటకు రావొద్దంటూ పోలీసులు హెచ్చరించారు. 

Tags:    

Similar News