నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు: నారా లోకేష్

Update: 2020-05-30 05:57 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అదికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇక మరో వైపు జగన్ ఏడాది పాలనలో ఒరిగినదేమి లేదంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ జగన్ పాలన పై విమర్శలు కురిపించారు. 

ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్ గారు గెలిచిన తరువాత ''షరతులు వర్తిస్తాయి''అంటూ మొహం చాటేసారు. నవ రత్నాలు తెచ్చి పోస్తానని, ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు. ఏడాది కాలంలో రద్దులు,భారాలు,మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు అని విమర్శించారు. ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు అని చెప్పారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలన అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుగువారి పరువుతీయకుండా పాలించాలి అని విమర్శించారు. 

Tags:    

Similar News