ట్రెండ్ మార్చిన టీడీపీ, జనసేన

Update: 2019-11-14 05:34 GMT

జగన్ టార్గెట్ గా టీడీపీ,జనసేన విమర్శలు చేస్తున్నాయి. పార్టీ నాయకులపై, మంత్రులపై, పార్టీ పై విమర్శలు చేయకుండా కేవలం జగన్ పై మాటల తూటాలు నేతలు పేలుస్తున్నారు. జగన్ ఒంటరి పోరాటం చేస్తూ ప్రతిపక్షాలకు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు, నేతలు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

మొన్నటి వరకు జగన్‌ను , మంత్రులను , వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు ట్రెండ్ మార్చాయి. జగన్ ‌ఒక్కడిని మానసికంగా ఇబ్బంది పెడితే పార్టీలో భారీ చీలికలు తేవచ్చనే రాజకీయ ఫార్ములా అవలంభిస్తున్నారు. ఎన్నికల హామీలైన నవరత్నాలను ప్రజలకు సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీనికోసం అనేక బిల్లులు రూపొందించి వాటికి చట్టబద్దత కల్పించింది. వీటి కోసం జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే జగన్ స్పీడ్‌కు మంత్రులు అందులేకపోతున్నారనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది.

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ నానా మాటలు అంటున్నారు. అయితే మంత్రులు కానీ, పార్టీ నాయకులు కాని వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులు, నాయకులను పక్కన పెట్టి ఒక్క సీఎం జగన్‌‌నే టార్గెట్ చేస్తూ టీడీపీ , జనసేనలు ముందుకు వెళుతున్నాయి.

గత రెండు నెలలుగా పంధా మార్చిన ఇరు పార్టీలు జగన్‌ జైలుకు వెళ్లాడు వెళతాడు అంటూ గతంలో వలె జగన్ జపం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఇవే మాటలు మాట్లాడి జగన్ ఇమేజ్‌ ను సగం పెంచిన టీడీపీ, జనసేనలు ఇప్పుడు మళ్లీ అదే పాటను అందుకోవడంతో వీరు రాజకీయ విమర్శలు చేయలేక వ్యక్తిగత విమర్శలకు వెళుతున్నారని వైసీపీ నేతలంటున్నారు. విమర్శలలో వాడి వేడి ఉండాలంటే రాజకీయంగా విమర్శల్లో దూకుడు తీసుకురావాలే తప్ప వ్యక్తిగత విమర్శలు మానాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News